కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా ఇందిర‌మ్మ ఇండ్లు ఆగ‌వు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. శ‌నివారం నాడు స‌చివాలయంలోని తన కార్యాల‌యంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డ‌లేద‌ని, కేంద్రం అనేక నిబంధ‌న‌ల‌తో కొర్రీలు వేస్తోంద‌న్నారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ. 1.52 ల‌క్ష‌లు కేంద్రం ఇస్తుంద‌ని కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 5లక్ష‌లు ఇస్తుంద‌ని తెలిపారు. కేంద్రం నుంచి అర‌కొర స‌హాయంపై ఆధార‌ప‌డ‌కుండానే రాష్ట్రంలో అనుకున్న ప్ర‌కారం ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని అన్నారు. కేంద్రం సూచించిన విధంగా రీసర్వే కూడా చేప‌ట్టామ‌ని ఇది తుది ద‌శ‌లో ఉంద‌న్నారు. వాస్త‌వానికి ల‌బ్దిదారుల ఎంపిక‌లో కేంద్ర నిబంధ‌న‌ల కంటే రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌లే ప‌క‌డ్బందీగా ఉన్నాయ‌న్నారు.

ఇండ్ల నిర్మాణ ప‌నులు కూడా ఆశించిన స్ధాయిలో పురోగ‌తిలో ఉన్నాయని సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక ద‌శ దిశ లేకుండా గ‌త ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను నిర్మించింద‌ని వీటిలో చాలా వ‌ర‌కు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నాయ‌ని క‌నీస వ‌స‌తులు కూడా లేవ‌ని అన్నారు. వీట‌న్నింటికీ అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి ల‌బ్దిదారుల‌కు కేటాయించ‌బోతున్నామ‌ని తెలిపారు. భూ భార‌తికి సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ప్ర‌ధానంగా సాదాబైనామాల‌కు సంబందించినవే ఉన్నాయ‌ని ఈ అంశం హైకోర్టు ప‌రిధిలో ఉంద‌ని కోర్టు తీర్పురాగానే ప‌రిష్కరించే విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసి ఉంచామ‌న్నారు.

తెలంగాణ చ‌రిత్ర‌, ఉద్య‌మం, క‌ళ‌లపై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారి పిఎ, డిప్యూటీ త‌హ‌శీల్ధార్ డాక్ట‌ర్ పైళ్ల న‌వీన్‌రెడ్డి ర‌చించిన తెలంగాణ చ‌రిత్ర‌, ఉద్య‌మం, క‌ళ‌లు మ‌రియు సాహిత్యం ఐద‌వ ఎడిష‌న్‌ను మంత్రిగారు ఆవిష్క‌రించారు. పుస్త‌క ర‌చ‌యిత న‌వీన్ రెడ్డిని ఈ సంద‌ర్బంగా మంత్రి గారు అభినందించారు. మూస ప‌ద్ద‌తిని వ‌దిలి స‌రికొత్త ఆలోచ‌నా విధానంతో ప్ర‌స్తుత పోటీ ప‌రీక్ష‌లకు అనుగుణంగా పుస్త‌కాన్ని ర‌చించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.