బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. వృథా నీటితో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు లోకేశ్ చేసిన ప్రకటనలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఎగువ ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో దిగువకు నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అవసరాలు పూర్తయిన తర్వాతే బనకచర్ల తదుపరి చర్చకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తుందని స్పష్టంచేశారు.
నదీ జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. గోదావరి నీటిని కూడా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఎత్తిపోతలకు వినియోగిస్తామని చెప్పారు. పోలవరం నుంచి సముద్రంలో కలుస్తున్న నీటి వినియోగం కోసం బనకచర్ల నిర్మిస్తున్నట్టు అమాయకంగా లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ నీళ్లు వృథాగా పోయేవి కావని, తెలంగాణ వాటా వాడుకున్నాకే.. మిగితా రాష్ర్టాల నీటి హక్కుల గురించి ఆలోచిస్తామన్నారు. పీఆర్‌ఎల్‌ఐ పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.