జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూత

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తండ్రి శిబు సోరెన్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏండ్లు. శిబు సోరెన్‌ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శిబు సోరెన్‌ కుమారుడు హేమంత్‌ సోరెన్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

శిబు సోరెన్‌ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, మూడుసార్లూ ఆయన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. మార్చి 2005లో ఆయన సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, తొమ్మిది రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2008 ఆగస్టులో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేవలం ఐదు నెలలు మాత్రమే అంటే 2009 జనవరి వరకూ ఆ కుర్చీలో కొనసాగారు. ఆ తర్వాత 2009 డిసెంబర్‌ నుంచి మే 2010 వరకూ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా, మూడు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. శిబు సోరెన్‌ మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.