- అక్కడ అధికారులదే హవా… ఇష్టారీతిన ఫైళ్ళ మార్పిడి!
- మంత్రికి తెలియకుండానే పలు వ్యవహారాలు
- పీసీబీ అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు
- సీఎం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి
- కర్నాటకలో మాదిరిగా పీసీబీ సభ్యులుగా ఎమ్మెల్యేలనూ నియమించాలనే డిమాండ్
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా పొల్యూటయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండానే ఫైళ్లను క్లియర్ చేస్తూ ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలనీ, కర్నాటకలో మాదిరిగా పీసీబీలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలకూ ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ప్రభుత్వంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక విభాగం. ఆ బోర్డుకు చైర్మెన్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. బోర్డులో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సీఎస్ అనుమతితో పాటు బోర్డులో చర్చ జరగాలి. పర్యావరణ కాలుష్య నివారణకు సంబంధించిన కీలక నిర్ణయాలపై నిర్దిష్ట చర్చ జరగాలి. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధిత శాఖ మంత్రికి వాటిని విడమర్చి చెప్పాలి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి మంత్రి సూచనలు, సలహాలను తీసుకుని ముందుకెళ్లాలి. కానీ, ఆ శాఖలో ఇదేమీ జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండటంతో పీసీబీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇదే అదనుగా భావించి ఆ శాఖలోని అధికారులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాలుష్య నియంత్రణపైనా, పాశమైలారం లాంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి కొండా సురేఖ ఆ శాఖ అధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. మంత్రి సూచనలను ఇప్పటి వరకూ అమలు చేయలేదనే చర్చ నడుస్తున్నది. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమావేశాలను కూడా రెగ్యులర్ గా నిర్వహించడం లేదు. పీసీబీలో ఏం జరుగుతున్నదనే దానిపై మంత్రికి నివేదించే అధికారులే కరువయ్యారు. పీసీబీ ఫైల్స్ ను కూడా మంత్రికి పంపడం లేదనీ, సచివాలయంలో నిర్వహించే సమీక్షలకు మొక్కుబడిగా హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంలో అధికారుల తీరుపై మంత్రి సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. సమీక్ష తర్వాత కూడా ఆమె కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదనే చర్చ నడుస్తున్నది. కీలకమైన ఫైళ్లను మంత్రి దృష్టికి తీసుకురాకుండా నేరుగా సీఎస్ కు పంపుతున్నారనే విమర్శలున్నాయి. మంత్రి కొండా సురేఖ సిఫారసు లేఖలను సైతం వారు పట్టించుకోవడం లేదనీ, ఆమె ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. పీసీబీ అధికారుల తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సదరు మంత్రి ఫిర్యాదు చేసినట్టు వినికిడి. ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నది. పక్క రాష్ట్రమైన కర్నాటకలో పీసీబీలో సీఎస్, ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో కీలకమైన చర్చల్లో ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాలను చెప్పే వెసులుబాటు ఏర్పడుతుందనే చర్చ నడుస్తున్నది.( సోర్స్: నవ తెలంగాణ)
