తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విడుదల చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసింది. రేవంత్ సర్కార్ ఆరోపణలను ఖండిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భవన్లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు గంటన్నర పాటు హరీశ్‌రావు ఏకధాటిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు, అబద్ధాలకు గట్టి సమాధానం ఇచ్చారు.
అయితే కాళేశ్వరం వాస్తవాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించేలా అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో.. తమ మోసాలను ప్రజలు గ్రహిస్తారనే ఉద్దేశంతో.. రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. తక్షణమే బీఆర్ఎస్ కార్యాలయాలు ఉన్న ఏరియాలకు ప్రభుత్వం కరెంట్ సరఫరా నిలిపివేసింది. అయినా కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లలో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షించారు. రేవంత్ సర్కార్ నిన్న చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రహించి.. కాంగ్రెస్ పై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
గోదావరి నది మీద ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించిన సర్ ఆర్ధర్ కాటన్ మీద కూడా నాటి బ్రిటీష్ పాలకులు కమీషన్ వేసి 900 ప్రశ్నలతో వేధించారు. కానీ చివరకు ఏం చేయలేకపోయారు. గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ నిలిచిపోయారు. ఇక్కడ రేవంత్ సర్కార్ ఎన్ని కమీషన్లు వేసినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా నిలిచిపోతాడు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఇందిరా గాంధీ వేసిన షా కమిషన్, చంద్రబాబు మీద వేసిన అనేక కమీషన్లు కోర్టుల ముందు నిలబడలేకపోయాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి.. బనకచర్లకు నీళ్ల జారగొట్టాలనే ఉద్దేశంతోనే రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. తన గురువు చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కమీషన్ల పేరిట గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, కానీ ఎప్పటికైనా అంతిమంగా నిలబడేది న్యాయం, గెలిచేది ధర్మమే అని తన ప్రసంగం ముగించే ముందు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తది.. వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులకు నీళ్ళు ఇచ్చి, కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని అని నిరూపిస్తాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.