ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను సప్లై చేయాలి
  • ఎప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి ఇంకనూ రావాల్సి ఉన్న 2.10 లక్షల మెట్రిక్ టన్నులను కూడా ఆగస్టు మాసంలో సరఫరా చేయాలి
  • కేంద్రమంత్రి జెపి నడ్డా లేఖకు ప్రతిస్పందనగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ

రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలకు యూరియాను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితులలో యూరియా సరఫరాలో ఎలాంటి ఆలస్యం తలెత్తిన పంటల దిగుబడులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే, ఆగస్టు నెలలో పంటల అత్యధిక యూరియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోందని అంచనా వేయడం జరిగిందని అన్నారు. గత ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రాష్ట్రానికి 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4.51 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా మాత్రమే జరిగిందన్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ ప్రారంభం నాటి నిల్వలు కూడా వాడుకొని 5.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించడం జరిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి, అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయంగా, 0.39 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో దిగుమతిగా రావాల్సిన యూరియాకు సంబంధించి షిప్ మెంట్ వివరాలు ఇంకా రాలేదని మంత్రి అన్నారు. అంతేకాకుండా దేశీయ సంస్థలైన PPL నుండి 11,000 మెట్రిక్ టన్నులు మరియు MCFL నుండి 7,000 మెట్రిక్ టన్నులు ఆగస్టులో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వారు సరఫరా చేయలేమని తెలియజేసినట్టు పేర్కొన్నారు.

ఎప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డా గారిని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు. అదేవిధంగా ఈ ఆగస్టులో సరఫరా చేయలేమని చెప్పిన PPL మరియు MCFL వల్ల ఏర్పడిన 18,000 మెట్రిక్ టన్నుల కొరతను RFCL ద్వారా భర్తీ చేయాలని మరియు ఆగస్టు నెలలో కేటాయించిన విధంగా రాష్ట్రానికి దిగుమతి ద్వారా అందాల్సిన 39,600 మెట్రిక్ టన్నుల యూరియాను ఈ నెల 20వ తేదీకి ముందు రాష్ట్రానికి చేరే నౌకల ద్వారా ఇవ్వాలని, దాంతో పాటు ఏప్రిల్ నుండి జూలై మధ్య ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరతను కూడా ఆగస్టు నెలలో మంజూరు చేయాలని లేఖ ద్వారా అభ్యర్థించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు అవుతున్న పంటలకు యూరియా లభ్యత నిరవధికంగా ఉండేలా చూసేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.