పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ. 1,200 విలువైన ఉచిత బియ్యాన్ని అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మల్లాపూర్‌లోని వైఏఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సాగుతోందని, అందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ చేయాలనే లక్ష్యంతో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలో నెలకు రూ.61 కోట్ల 15 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, పేదలకు అందించాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. గతంలో మా ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేసిందని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలను తీసుకువస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు రేషన్ కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని, ఇంకా అర్హులైన వారిని కూడా త్వరలో గుర్తించి కార్డులు ఇస్తామని, వడ్డీ లేని రుణాల పథకంతో మహిళలకు కోట్ల రూపాయలు కేటాయించి, వారికి వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ అందించి ఇందిర మహిళా శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని మహేశ్వరం, బాలాపూర్ మండలాల వారికి మంత్రి రేషన్ కార్డులు పంపిణీ చేసి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, TUFIDC చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కందుకూరు RDO రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
