- NHAI & MoRTH ప్రాజెక్ట్స్ పనుల పురోగతిపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం
- విద్యుత్ లైన్ షిఫ్టింగ్,వాటర్ యుటిలిటీ క్లియరెన్స్,ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధిత అంశాలపై అధికారులు తక్షణం స్పందించాలి
- ఇక నుండి రెగ్యులర్ గా భేటి అవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం
- అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తేనే టాస్క్ ఫోర్స్ బాగా పని చేసినట్టు
- ఇవాళ చర్చించిన అంశాలు త్వరగా పూర్తి అయ్యేలా నిబద్ధతతో పనిచేయాలని కోరుతున్న
- రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ కు మణిహారం..రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలానే చిత్తశుద్ధి తో ఉన్నాం
- ఉత్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తి అయింది..6లేన్ గా అప్గ్రేడ్ చేయడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయి
- రాజకీయాలు కాదు రాష్ట్రాభివృద్దే మాకు ముఖ్యం..త్వరలో ప్రధాని మోడీని కలుస్తాం..
- రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ కమిటీ మొదటి సమావేశం
రాష్ట్రంలో మంచి రోడ్ నెట్వర్క్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు NHAI&MoRTH ప్రాజెక్ట్స్ పనులు వేగంగా పూర్తి చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సరైన ప్రణాళికలతో వెళ్లేందుకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పనుల పురోగతినీ పర్యవేక్షించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి చైర్మన్ గా,ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్,సీసీఎల్ఏ కమిషనర్,విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,ఇరిగేషన్,పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మైన్స్,జియాలజి,పిసిసిఎఫ్,NHAI, MoRTH రీజినల్ ఆఫీసర్స్,ఆర్ అండ్ బి NH చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయనుంది.
విద్యుత్ లైన్ షిఫ్టింగ్,వాటర్ యుటిలిటీ క్లియరెన్స్,ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధిత అంశాలపై గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు మంత్రి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్ శాఖ కు సంబంధించి వరంగల్ – ఖమ్మం సెక్షన్ లో NH- 163G పరిధిలోని ప్యాకేజీ 2లో చెరువుల అంశాన్ని మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో NH అధికారులు వివరించారు. మహబూబాబాద్,నెల్లికుదురు ప్రాంతంలో చెరువుల సమస్యలు దాంతో పాటు హై లెవల్ బ్రిడ్జి ప్రపోజల్స్ పై వివరించారు. ఇరిగేషన్ శాఖ నుండి Noc రావాల్సి ఉందని అన్నారు. NH 30 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోడ్డు తో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకు సంబంధించి పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇరిగేషన్ శాఖ ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రత్యేక చొరవ తీసుకుని మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఫారెస్ట్ క్లియరెన్స్ కు సంబంధించిన అంశాలు ప్రధానంగా మంత్రి దృష్టికి తెచ్చారు. NH ప్రాజెక్ట్స్ 12 ఉంటే అందులో 6 ప్రాజెక్టులు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కల్వకుర్తి – శ్రీశైలం 62 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారనీ,ఫారెస్ట్ అధికారులు అందుకు తగ్గట్టుగా సమన్వయంతో పనిచేస్తే గొప్ప ప్రాజెక్ట్ పూర్తి చేసిన వారిమవుతామన్నారు. ఎలక్ట్రికల్ కు సంబంధించి 220కెవి,400కెవి లైన్ సమస్యలతో పాటు,33కెవి,11కెవి లైన్ షిఫ్టింగ్ సమస్యలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏ ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో వివరాలు ఇవ్వాలని, వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారి ముషారఫ్ ఆలీకి బాధ్యతలు అప్పగించారు.
మైనింగ్ డిపార్ట్ మెంట్ నుండి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా సంబంధిత అధికారి శ్రీధర్ కు పనులు వెంటనే క్లియర్ చేసేలా చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానంగా భూసేకరణలో భాగంగా రెవెన్యూ కు సంబంధించిన అంశాలే ఎక్కువ ఉన్నాయని వాటిని వెంట వెంటనే పరిష్కరించేందుకు సీసీ ఎల్ ఏ కమిషనర్ లోకేష్ కృషి చేయాలన్నారు. కొన్ని చోట్ల సున్నిత అంశాలు ఉంటాయని వాటి పట్ల మానవతా దృక్పథంతో అధికారులు మెదలాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి ఇక నుండి రెగ్యులర్ గా భేటి అవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.
టి ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ సూచనల మేరకు ఈనెల 18న మరోమారు భేటీ అవుదామని,ఆయా జిల్లా కలెక్టర్లు హాజరు అయ్యేలా చూడాలని మంత్రి చెప్పారు. తర్వాతి మీటింగ్ కు ఇప్పుడు వచ్చిన అంశాల పై క్లారిటీ వచ్చేలా సంబంధిత కలెక్టర్లు,ఆర్డీవో లను తను కో ఆర్డినేట్ చేస్తానని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తేనే టాస్క్ ఫోర్స్ బాగా పని చేసినట్టు అవుతుందని,ఇవాళ చర్చించిన అంశాలు త్వరగా పూర్తి అయ్యేలా నిబద్ధతతో పనిచేయాలని కోరుతున్నానని మంత్రి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ కు మణిహారమణి,రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలానే చిత్తశుద్ధి తో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తి అయింది..6లేన్ గా అప్గ్రేడ్ చేయడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయన్నారు. సంగారెడ్డి,మెదక్,సిద్దిపేట,భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. భూ పరిహారం చెల్లింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తమకు రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్దే ముఖ్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం త్వరలో ప్రధాని మోడీని కలుస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షలో రాష్ట్ర స్పెషల్ సి.ఎస్ వికాస్ రాజ్, పిఆర్ అండ్ ఆర్ డి, మైనింగ్ శాఖల సెక్రటరీ ఎన్ శ్రీధర్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్,విద్యుత్ శాఖ అధికారి ముషారఫ్ అలీ,అటవీ శాఖ అధికారి శరవణన్, NHAI, MoRTH రీజినల్ ఆఫీసర్స్ కృష్ణ ప్రసాద్,శివ శంకర్,నీటిపారుదల శాఖ సి.ఈ లు హరనాథ రావు, శ్రీనివాసరెడ్డి,ఆర్ అండ్ బి ఈఎన్సి జయ భారతి,సి.ఈలు,పలువురు అధికారులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.