పిసిబి టాస్క్ ఫోర్స్ కమిటీ స్థానంలో.. ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ

  • పరిశ్రమల అనుమతుల్లో అవకతవకలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి
  • పీసీబీ అధికారులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
  • జనావాసాల నుంచి ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల తరలింపు..
  • నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివరైన కఠిన చర్యలు తప్పదు..
  • కాలుష్యకారక పరిశ్రమలపై ఉదాసీనత దేనికి..?
  • ఫార్మా పరిశ్రమలు పర్యావరణానికి కట్టుబడి పని చేయాలి..

పర్యావరణ పరిరక్షణను ఉల్లంఘించే పరిశ్రమల తనిఖీలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఉన్న టాస్క్ ఫోర్స్ స్థానంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ కమిటీలో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారితోపాటు అటవీ, రెవెన్యూ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అధికారులు, పర్యావరణ పరిరక్షకులు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. పీసీబీ పనితీరుపై సచివాలయంలో బుధవారం ఆమె సమీక్షించారు. పీసీబీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు అనుమతులే లేని, అనుమతుల గడువు ముగిసిన పరిశ్రమల్ని ఎన్నిసార్లు తనిఖీ చేశారు. స్థానికంగా భూగర్భ జలాల కాలుష్యంపై ఏం చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారుల్ని ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ముందు ఉన్న కేసులు, సిపిసిబికి అందిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పరిశ్రమల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపైనా.. మరికొన్ని పరిశ్రమలు కిందిస్థాయి ప్రతినిదులను పంపడంపైనా మంత్రి కొండా సురేఖ తప్పుబట్టారు. పరిశ్రమల అనుమతుల్లో ఉదాశీనత సరికాదనీ, ఎక్కడైనా ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యంపై విపరీతమైన ఫిర్యాదులు రావడమెంటని ప్రశ్నించారు. అలాంటి వాటిపై చాలా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల అనుమతుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని పిసిబి (PCB) ఉన్నతాధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతటి వారైనా పర్యావరణ పరిరక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేస్తున్నామనీ, కంప్యూటరైజ్డ్ తనిఖిల ప్రక్రియ కూడా చేపట్టామని పిసిబి(PCB) మెంబర్ సెక్రెటరీ జి‌. రవి వెల్లడించారు.

‘ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలను జనావాసాలున్న చోటు నుంచి తరలించాలి. ఔటర్ రింగు రోడ్డు అవతలనే ఫార్మా కంపెనీలు ఉండాలని సీఎం చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి ఆదేశించారు. ‘వాయు, నీటి కాలుష్యంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై కఠినంగా ఉంటాం. సిగాచి ఘటన తర్వాత కంపెనీల్లో మరింత భద్రత అవసరం ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి’ అని మంత్రి సురేఖ సూచించారు. పరిశ్రమల్లో ఏది, ఎలా ఉందో యాజమాన్యాలు తరుచూ స్వీయ తనిఖీలు చేసుకోవాలనీ.. పిసిబి(PCB) తరుపున కూడా ఇక నుంచి తరుచూ ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీం, పీసీబీ మెంబర్ సెక్రెటరీ రవి, చీఫ్ ఇంజినీర్ రఘు, జెసిఈఎస్ నాగేశ్వర రావు, జెసిఈఈ శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్ తో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.