రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) పాలకవర్గాల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సహకార చట్టంలోని 32(7)(ఏ) సెక్షన్ ప్రకారం.. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం కొత్త ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతుంది. పనితీరు సరిగా లేకపోయినా, సొసైటీల్లో అవినీతి, ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించి చర్యలు తీసుకునే అధికారం సహకారశాఖ రిజిస్ట్రార్‌కు కల్పించారు.
రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాత తొమ్మిది జిల్లాలకు డీసీసీబీలు, రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ ఉన్నాయి. వీటిన్నింటి పాలకవర్గాల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించటం విశేషం. సహకార సంఘాలు, సహకార బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆయా పాలకవర్గాల కోసం తక్షణమే ఎన్నికలు జరపటం సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులను జారీచేసింది. ఇంతకుముందు 2024 ఫిబ్రవరి 24న సహకార సంఘాలు, సహకార బ్యాంకుల పదవీకాలాన్ని పొడిగించారు.