ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌ వద్ద, అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. నయా భారత్‌ ఇతివృత్తంతో ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. ఎర్రకోటపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ బ్యానర్‌ను ప్రదర్శించారు.

కాగా, ఎర్రకోటపై 12వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2014లో తొలిసారిగా ఎర్రకోట నుంచి ప్రసంగం చేశారు. అప్పుడు 65 నిమిషాలపాటు మాట్లాడారు. దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 17 సార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇందిరాగాంధీ 16 సార్లు జాతీయ జెండా ఎగురవేశారు. ఇక చారిత్రక ఎర్రకోట నుంచి అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. 2024లో 98 నిమిషాలపాటు మాట్లాడారు. 1947లో నాటి ప్రధాని నెహ్రూ 72 నిమిషాలపాటు ప్రసంగించారు. 2015లో నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఎర్రకోట నుంచి అతితక్కువ సమయం ప్రధాని ప్రసంగం 14 నిమిషాలే కావడం, అదీ నెహ్రూ, ఇందిరా పేరిట ఉండటం గమనార్హం.