కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • 2027 నాటికి అందించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం
  • 20 శాఖలకు చెందిన 250 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ

2027 నాటికి ఏఐ ఆధారిత పౌర సేవలను కోటి మంది ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘ఏఐ – లెడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ – ఛాంపియన్స్ & కాటలిస్ట్స్ ప్రోగ్రామ్’ పేరిట ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్(ఐటీ శాఖ) ఆధ్వర్యంలో ప్రభుత్వాధికారులకు జూబ్లీహిల్స్ లోని డా.ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్సిట్యూట్ లో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తమది సమస్య వచ్చిన తర్వాత స్పందించే ప్రభుత్వం కాదన్నారు. ముందుగానే ఊహించి పరిష్కరించే చురుకైన, పారదర్శకమైన, ముందుచూపున్న ప్రభుత్వమన్నారు. ఏఐ సహకారంతో ప్రజలు అడగకుండానే వారి ముంగిటకు పౌర సేవలను చేర్చే సరికొత్త తెలంగాణను నిర్మించాలన్నదే తమ సంకల్పమన్నారు. ఈ కొత్త తెలంగాణ 5 బిలియన్ డాలర్ల ఏఐ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. ‘ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణ’ను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను అందుబాటులోకి తేబోతున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచామన్నారు. ఇదే స్ఫూర్తితో 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను ఏఐ ఆధారిత ప్లాట్ ఫాంపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఆయా శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి… ఏఐ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీరికి మూడు నెలల పాటు ఏఐ నిపుణులు మోంటార్లుగా వ్యవహరించి మార్గదర్శకత్వం చేస్తారని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డిప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.