భవిష్యత్ అంతా ఉద్యానపంటలదే – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్ ఇంజన్ గా నిలుస్తున్నాయి
  • హార్టికల్చర్ విద్యార్థులు ప్రావిణ్యాన్ని పెంచుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి
  • యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్, అధ్యాపక సిబ్బందిని విద్యార్థులను ఫీల్డ్, పంటపోలాల్లో ఎక్కువ పర్యటించేటట్టు చేయాలి

కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాలును ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే. గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది. హార్టికల్చర్ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉటుంందని, విద్యార్థులుగా ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కన్నా, మీకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని మంత్రిగారు పేర్కొన్నారు. విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పోలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు.

హార్టికల్చర్ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్ ను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్ పంటను 10 లక్షల ఎకరాలకు రాష్ట్రంలో విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి అన్ని పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్ దే అని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్ ఇంజన్ గా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని మంత్రిగారు పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఙానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వైస్ చాన్స్ లర్ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, వ్యవసాయ కమిషన్ సభ్యులు మరియు యూనివర్సిటి ప్రొఫెసర్లు పాల్గొన్నారు.