హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న గణేష్ ఉత్సవాలను
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల గణేష్ ఉత్సవాలు–2025 ఏర్పాట్ల పై ఎంసిఆర్ హెచ్ఆర్ డి లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, MLC దయానంద్, డీజీపి డా జితేందర్ , ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్, బాలాపూర్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. ఈ నెల 27 వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6 వ ముగియనున్న గణేష్ ఉత్సవాలు–2025 సజావుగా జరిపేందుకు నిర్వాహకులు,ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలనీ ప్రభుత్వం తరపున కోరుతునన్నారు. భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ధార్మిక కార్యక్రమాన్ని గతం సంవత్సం కంటే ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచన, మార్గదర్శనం మేరకు గణేష్ ఉత్సవాల ప్రతిష్టాపన, నిర్వహణ, నిమజ్జనం సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతి భద్రత లకు విఘాతం కలగకుండా , ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టలనీ సంబంధిత అధికారులకు సూచించారు. నిర్వహకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండపం వద్ద విద్యుత్ ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని విద్యుత్ అధికారులకు మంత్రి సూచించారు.
ఇప్పటికే రోడ్డు సేఫ్టీ కార్యక్రమం ద్వారా నగరంలో రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. అదనపు నిధులతో దెబ్బతిన్న రోడ్లకు నార్మల్ కండిషన్ కు తెస్తున్నట్లు తెలిపారు. ఎండోమెంట్, సాంస్కృతిక శాఖలు ఉత్సవ ప్రాధాన్యాన్ని సమాజానికి ఉపయోగపడేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గణేష్ ఉత్సవాలలో శాఖలు తమకు ఇచ్చిన భక్తి భావంతో బాధ్యతను నిక్కచ్చిగా నిర్వర్తించాలనీ ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది అందరి పండుగ. హైదరాబాద్ లో జరిగే బిగ్గెస్ట్ ఫెస్టివల్. అన్ని ప్రభుత్వ శాఖలు, ఉత్సవ సమితి ,ప్రజలు పరస్పర సహకారంతో సక్సెస్ చేద్దామని మంత్రి అన్నారు.
జీహెచ్ఎంసీది కీ రోల్: మేయర్
మేయర్ గద్వాల విజయలక్షీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జీహెచ్ఎంసీది అతిపెద్ద బాధ్యత అని అన్నారు. వేడుకల్లో జీహెచ్ఎంసీ చేస్తున్న ఏర్పాట్ల పై కమిషనర్ సమావేశంలో సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు.
గత సంవత్సరం కంటే వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఉత్సవ సమితి సభ్యులు లిఖిత పూర్వకంగా తనకు గాని, కమిషనర్ కు గానీ తెలిజేస్తే …వాటిని పరిష్కరిస్తామని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున నిర్వాహకులు, ప్రజలు, యంత్రాగం అప్రమత్తంగా ఉంటూ ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సేఫ్ గా జరుపుకుందామని అన్నారు.
డీజీపి డా జితేందర్ మాట్లాడుతూ…
గణేష్ ఉత్సవాలలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం, సహకారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గత సంవత్సరం కంటే అదనంగా సిబ్బందిని డ్యూటీ కి ఉపయోగిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఎలాంటి గ్యాప్ లేకుండా సమన్వయం చేసుకుంటే వేడుకలు బాగా జరుగుతాయన్నారు. వర్షం పడుతున్నందున ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపి సూచించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే గణేష్ ఉత్సవాలలో జీహెచ్ఎంసీ కీలక పాత్ర పోషిస్తుందనీ చెప్పారు. జీహెచ్ఎంసీ అన్ని విభాగాలు, ఇతర శాఖలతో సమన్వయంతో పౌరుల సౌకర్యం, భద్రత దృష్ట్యా నిరంతరం కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలు , జాతీయ రహదారుల్లో గుంతలు పూడ్చడం ,రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు శుభ్రతా చర్యలు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, కృత్రిమ పాండ్ ల నిర్మాణం వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇంజనీరింగ్ బృందాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు ప్రధాన చెరువులు, నిమజ్జన స్థలాల్లో క్రేన్లు, పరికరాలను సిద్ధం చేస్తున్నాయన్నారు. నగర ప్రజలకు 2 లక్షల ఎకో ఫ్రెండ్లీ గణేష్ ల ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వేడుకల్లో బడ్జెట్, మౌలిక సదుపాయాల సహకారం అందిస్తున్నామని కమిషనర్ మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గణేష్ మండపాలకు గత సంవత్సరం లాగే ఉచిత విద్యుత్ అందిస్తామని TGSPDCL CMD ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు.
“గణేష్ నిమజ్జన కార్యాచరణ” గైడ్ ను ఆవిష్కరించిన మంత్రి
గణేష్ ఉత్సవాలలో ప్రభుత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం, సహకారం, సమాచారం పెంపొందించే ఉద్దేశ్యంతో జిహెచ్ఎంసి ప్రత్యేకంగా రూపొందించిన గణేష్ నిమజ్జన కార్యాచరణ” గైడ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ , డీజీపీ, కమిషనర్ లు సమావేశంలో ఆవిష్కరించారు. జోన్ లు, సర్కిల్ ల వారిగా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణ, బాధ్యుల మొబైల్ నెంబర్ లు, గణేష్ యాక్షన్ టీం వివరాలు ఇందులో పొందుపరిచారు. సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చక్కగా వివరించినందుకు ఉత్సవ సమితి సభ్యులు జీహెచ్ఎంసీనీ. అభినందించారు.

సమావేశంలో ఎన్విరాన్ మెంట్ , అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, అగ్నిమాపక డీజీ నాగి రెడ్డి , hmda కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్ సిపి సి.వి. ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్ బాబు , సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి నారాయణ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సమాచార శాఖ అదనపు డైరెక్టర్ బి జగన్,
అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, సమాచార వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బి , ట్రాన్స్పోర్ట్ , ఆర్టీసీ , అగ్నిమాపక, సమాచార శాఖ, రైల్వే , మెట్రో , భాషా సంస్కృతిక శాఖ,నీటి పారుదల, కాలుష్య నియంత్రణ , వైద్య ఆరోగ్య శాఖ ,ప్రోటోకాల్, ఎండోమెంట్, భాగ్యనగర్, ఖైరతాబాద్, బాలానగర్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
