ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
  • టిబిజేపి చీఫ్ రామచంద్ర రావు వ్యాఖ్యలు అవగాహనరాహిత్యం. సవాళ్లు కాదు సమస్య పరిష్కారం చేయాలి
  • ఇతర రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు సరఫరా చూస్తే మీ వాదనలో డొల్లతనం తెలుస్తుంది
  • యూరియా కొరత పై ప్రతిపక్ష పార్టీ ల వ్యాఖ్యలు అర్థరహితం

తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన నిరసన ప్రదర్శనతో కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖకు పరిస్థితులు తెలిశాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఎంపీల ఆందోళనతో తక్షణమే ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు.
కర్ణాటక నుంచి 10800 మెట్రిక్ టన్నుల యూరియా మొదటి షిప్ మెంట్ ప్రారంభం అయిందనీ, ఈ వారంలో మరో మూడు షిప్ మెంట్ ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలు జారీ చేశారు.ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల కోరారు. యూరియా కొరత పై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు, మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అభినందనలుతెలిపారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలనీ తుమ్మల రైతన్నలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ కు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు తలెత్తాయని, కొందరు బీ.ఆర్.ఎస్ నేతలు వారి అనుచరులతో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కొరత పై రైతాంగం ఆందోళన చెందే విధంగా కుట్రలు చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు.

ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయింపులు చేశారు. ఆగస్ట్ 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి కానీ ఇప్పటి వరకు 5.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారు.కేటాయించిన యూరియా లో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలో కొరత వల్ల రైతాంగంలో ఆందోళన నెలకొంది.ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువ ఉన్నందున కేటాయించిన యూరియాకు అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ ను మంత్రి తుమ్మల కోరారు. ఈ వారంలోనే మిగతా మూడు షిప్ మెంట్ లు ద్వారా యూరియా సరఫరా సకాలంలో చేయాలని మంత్రి తుమ్మల కోరారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు రైతాంగం పక్షాన నిలబడాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. బఫర్ స్టాక్స్ పై ప్రతిపక్ష పార్టీ ల నేతల వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు.మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించి ఎరువులు ముందుగానే తెప్పించి మే నుంచి బఫర్ స్టాక్స్ నిలువ చేయాలని ప్రతిపాదన చేస్తే కేంద్రం ప్రభుత్వం జాప్యం చేస్తూ యూరియా కొరతకు కారకులయ్యారు .ప్రణాళిక తో పనిచేస్తున్నా కూడా బీ.ఆర్.ఎస్ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలు రాజకీయ స్వార్థంతో చేస్తున్న యూరియా కొరత కృతిమ ఆందోళనలతో అన్నదాతలను ఆగం చేస్తున్నారని ,రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే రసాయనాలు ఎరువులు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలి ,కానీ రైతులను ఆందోళనకు గురిచేయడం సమంజసమేనా ,రైతాంగం ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడకుండా ఆలోచన చేయాలనీ కోరారు. తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచంద్ర రావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణ రైతాంగం పట్ల బిజేపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే యూరియా సరఫరా లో కొరత లేకుండా చేయాలని తుమ్మల సూచన చేశారు.సవాళ్లు కాదు సమస్య పరిష్కారం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగంకు ఎల్లపుడు ప్రభుత్వం అండగా ఉంటుందనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.