హైదరాబాద్: పోలీస్ అకాడమీలో తొలి మహిళా పోలీస్ అధికారుల మూడురోజుల సదస్సును తెలంగాణ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా సంక్షేమం & శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క ముఖ్య అతిధిగా హాజరై బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష్ బిష్త్ ఐ పి ఎస్ మొదటి మహిళా పోలీస్ అధికారుల రాష్త్ర స్థాయి సదస్సు లక్ష్యాలను, సదస్సులో చేర్చించే ముఖ్యాంశాలను వివరించారు. మూడురోజుల సదస్సులో కానిస్టేబుల్ నుండి డిజిపి స్థాయి అధికారులందరూ ఐదు గ్రూపులుగా చర్చించి ఒక నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తారని తెలిపారు.
ఈ సదస్సులో తెలంగాణ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా సంక్షేమం & శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళల శ్రేయస్సు కోసం ప్రభుత్వము ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. మహిళా అధికారులందరూ అంకితభావం, క్రమశిక్షణ మరియు గౌరవం తో పనిచేయాలని కోరారు. సదస్సులో పాల్గొన్న మహిళ అధికారులకు మీరంతా ధైర్యం, దృఢ నిశ్చయంతో పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా మార్పు కావాలని కోరారు. ఈ సదస్సులో సమస్యలపై చర్చించి మంచి సూచలను రూపొందించాలని కోరారు. మహిళా అధికారుల సంఖ్య పెరుగుతున్నందుకు గర్వపడుతున్నామని, మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా పోలీస్ అధికారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని, భవిష్యత్లో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా పోలీస్ అధికారుల శిక్షణ, భద్రత, మరియు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.
మహిళా పోలిసుల సమస్యల కోసం డిజిపి ప్రత్యకమైన ఒక సెల్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచించారు. మహిళా పోలిసుల కోసం తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాలలో మహిళా అధికారులకు ప్రత్యకమైన సౌకర్యాలు కలిపించిన విధంగా వాటిని స్టడీ కోసం ఒక టీంని ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా మహిళా అధికారుల ఆరోగ్యం కోసం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులే పోలీస్ స్టేషన్లో బాధితులుగా మారవద్దని సూచించారు.
ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 పోలీస్ స్టేషన్లు, ఇతర యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ అయిన జైళ్ల శాఖ, అటవీ శాఖల నుండి దాదాపు 400 మంది అధికారులు పాల్గొన్నారు. వీరికి ఈ మూడురోజులు అకాడెమీలోనే వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ సదస్సులో మంత్రి సీతక్కను అకాడమీ డైరెక్టర్ మరియు ఇతర సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి మెమొంటోను అందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రమునుండి హాజరైన డిఐజి వినీత్ ను, స్వాతిలక్రా ఐ పి ఎస్, అడిషనల్ డీజీ, బాలనాగదేవి ఐ పి ఎస్, అడిషనల్ డీజీ, చారుసిన్హా ఐ పి ఎస్, అడిషనల్ డీజీలను మెమొంటోలతో అకాడమీ డైరెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల గురించి మరియు ముఖ్య అతిధి గురించి అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి. కవిత స్ఫూర్తిదాయకమైన పరిచయ కార్యక్రమం, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ. వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి సదస్సులో రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటుపోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష్ బిష్త్ ఐపిఎస్, శ్రీమతి స్వాతిలక్రా ఐ పి ఎస్, అడిషనల్ డీజీ, శ్రీమతి. బాలనాగదేవి ఐ పి ఎస్, అడిషనల్ డీజీ, శ్రీమతి. చారుసిన్హా ఐపిఎస్, అడిషనల్ డీజీ, శ్రీమతి రమా రాజేశ్వరి, ఐపిఎస్ డిఐజి, ఎస్పీ స్థాయి అధికారులు మరియు అకాడమీ ఇండోర్ మరియు ఔట్డోర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.