హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందో తెలియదా? అని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి యూరియా కొరత ఎందుకు ఏర్పడిందో తెలియదా అని ప్రశ్నించారు. జియో పాలిటిక్స్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎర్ర సముద్రంలో నౌకాయానం నిలవడం వల్ల యూరియా దిగుమతి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేదని కిషన్ రెడ్డి ఓ పక్క చెబుతూనే.. మరోపక్క యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తుమ్మల మండిపడ్డారు. యూరియా దిగుమతులు లేకపోవడం, దేశీయంగా ఏర్పడిన కొరతపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత నెలకొంటే కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి సరికాదన్నారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి.. సొంత రాష్ట్ర రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని రాష్ట్రానికి యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. వాస్తవ పరిస్థితులను రాష్ట్ర మంత్రులు రైతాంగానికి వివరిస్తుంటే.. తమపైనే అభాండాలు వేయడం మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది మూడో పంట కాలమని, ఏడాదిన్నరగా రైతులు యూరియా కోసం ఆదోళన చెందలేదని, ఈసారి కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయకపోవటంతోనే కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్రం కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయకపోవడం వల్లే రైతులు ఆందోళనకు దిగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వంతో ఏర్పడిన యూరియా కొరతపై వాస్తవాలు దాచి రాజకీయ ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని, కానీ ఇప్పటివరకు కేవలం 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే సరఫరా చేసిందని, దీంతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందన్నారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి బాధ్యతగా ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్షణమే సరఫరా అయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.