బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగానే ఇవ్వాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పార్టీపరంగా ఇస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ రిజర్వేషన్లపై రాజ్యాంగబద్ధంగా జీవో జారీ చేసి పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని.. బీజేపీ బీసీలకు వ్యతిరేకం కాదని, ప్రస్తుతం బీసీల పార్టీగా మారిందన్నారు. ఈ నెల 29న జరగనున్న క్యాబినెట్‌ సమావేశంలో బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టం చేయకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.