ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదాహరణగా వివరించారు. కొందరు వ్యక్తులు.. ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు.

దేశానికి యువ నాయకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ఉస్మానియా వర్సిటీనేనని గుర్తు చేశారు. యూనివర్సిటీలు సమస్యలపై చర్చలకే కాదు..సైద్దాంతిక అంశాలకు వేదిక సైతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చలు జరపాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

 ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ.కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. అయినా.. మీకు ఎందుకంత శునకానందం అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నరసింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి సైతం ఈ యూనివర్సిటీ విద్యార్థేనని పేర్కొన్నారు. తెలంగాణ నలుమూలల్లో ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే అని తెలిపారు. చదువుతోపాటు పోరాటాన్ని సైతం నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అభివర్ణించారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఈ యూనివర్సిటీనే అని వివరించారు.