- ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులూ జప్తు
- అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ
- ముందస్తు బెయిల్ కు అవకాశమే లేదు..
- 22 మంది అధికారులు ఇప్పటికీ జైలుకే పరిమితం
- బెయిల్ దొరక్క నెల రోజులుగా చంచల్ గూడ
- జైల్లోనే కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్ రావు
- ఎంతటివారైనా 2 నెలలు జైల్లో రిమాండ్ పక్కా
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తున్నది. అవినీతి నిరోధక చట్టం కింద 2 నెలల నుంచి 3 నెలల పాటు జైల్లోనే ఉంచుతున్నది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో వందల కోట్లు విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటున్నది. అవినీతితో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నది. ఈ ఏడాది 8 నెలల కాలంలో మొత్తం 162 కేసులను నమోదు చేయగా.. ప్రైవేట్ వ్యక్తులుసహా దాదాపు 180 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో 22 మంది గత మూడు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం ఈఎన్సీ మురళీధరన్ ను గత నెల 22న అరెస్ట్ చేయగా… నెల రోజులుగా బెయిల్ లభించడం లేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టులు డిస్మిస్ చేశాయి. మరో ఈఎన్సీ హరిరాంను ఏప్రిల్ 26న అరెస్ట్ చేయగా..52 రోజులపాటు జైల్లోనే ఉన్నాడు. జూన్ 11న అరెస్ట్ అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ 48 రోజులపాటు జైలు జీవితం అనుభవించాడు. వీరిద్దరు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు.
అవినీతి కట్టడికి..
ప్రభుత్వ ఖజనా నుంచి జీతం తీసుకునే ఉద్యోగులు సహా పబ్లిక్ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై ఏసీబీ నిఘా పెడుతున్నది. ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి, ట్రాప్ స్కెచ్ వేస్తున్నది. దర్యాప్తులో భాగంగా లంచం డిమాండ్ చేసిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల గురించి వివరాలు సేకరిస్తున్నది. బాధితులు అందించే ఆధారాలను అధికారులు పరిశీలిస్తారు. సంబంధిత అధికారులను పట్టుకునేందుకు వల పన్నుతారు. ఈ క్రమంలోనే బాధితుడితో కలిసి పలు మార్లు ఆయా పరిసర ప్రాంతాలను గమనిస్తుంటారు. ట్రాప్, ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించే సమయంలో ఏసీబీ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తారు. రెండు రకాల కెమికల్స్ పూసిన కరెన్సీ నోట్లు ఇచ్చి, బాధితుడికి స్పై కెమెరాలు అమర్చుతారు. అధికారులు లంచం అడిగిన వివరాలతోపాటు లంచంగా తీసుకున్న డబ్బును సీజ్ చేసేంత వరకు వీడియో రికార్డ్ చేస్తారు.
ఇలా రికార్డింగ్ చేసిన వీడియోలను కోర్టుకు సమర్పిస్తారు. అయితే, సాధారణంగా క్రిమినల్ కేసుల్లో వివిధ రకాల నేరాలకు సంబంధించి ఆయానేర తీవ్రతను బట్టి 15 రోజుల్లోగా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ, ఏసీబీ కేసుల్లో మాత్రం అలాంటి అవకాశాలు లేవు. ముందస్తు బెయిల్ సహ రెగ్యులర్ బెయిల్ పొందాలంటే తీవ్రతను బట్టి రెండు నుంచి మూడు నెలలపాటు జైల్లో ఉండాల్సిందే. కొన్ని కేసుల్లో మాత్రం కనీసం నెల రోజులు జైలు తప్పదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో డాక్యుమెంట్ల పరిశీలన, ప్రాసిక్యూషన్ ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. (సోర్స్: వి6 వెలుగు)