భారీగా న‌ష్ట‌పోయిన జిల్లాకు అద‌నంగా నిధులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్ధితుల‌పై నిరంతర స‌మీక్ష‌
  • యుద్ధ ప్రాతిప‌దిక‌న ర‌వాణా సౌక‌ర్యం పున‌రుద్ద‌ర‌ణ‌
  • శ‌వాల‌పై చిల్ల‌ర ఏరుకొనేలా బిఆర్ఎస్ వ్య‌వ‌హారం
  • రాష్ట్ర రెవెన్యూ, విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ‌ర‌ద ప‌రిస్ధితులు, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొద్ది స‌మ‌యంలోనే ముఖ్యంగా మెద‌క్‌, కామారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌న్నారు. అయినా కూడా ప్రాణ నష్టం, ఆస్తిన‌ష్టం వీలైనంత మేర‌కు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి సూచ‌న‌ల మేర‌కు బుధ‌వారం మ‌ధ్య‌హ్నం నుంచే ప‌రిస్ధితిని స‌మీక్షించామ‌ని వెల్ల‌డించారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామ‌న్నారు. సిరిసిల్ల జిల్లాలోని నర్మల గ్రామం వ‌ద్ద బుధ‌వారం నాడు మానేరు వాగు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ఐదుగురిని హెలికాప్ట‌ర్ ద్వారా ర‌క్షించామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు వారం రోజుల క్రిత‌మే కోటి రూపాయిల చొప్పున నిధులు విడుద‌ల చేశామ‌ని, ప్ర‌స్తుతం అతి భారీ వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న జిల్లాల‌కు అద‌నంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామ‌ని తెలిపారు.

భారీ వ‌ర్షాల‌తో స్ధంభించిన జాతీయ ర‌హ‌దారితోపాటు పంచాయితీరాజ్‌, ఆర్ &బీ రోడ్ల‌ను క్లియ‌ర్ చేశామ‌ని, దెబ్బ‌తిన్న రోడ్ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న తాత్కాలికంగా పున‌రుద్ద‌రిస్తున్నామ‌ని తెలిపారు. ప‌లు మండ‌ల కేంద్రాలు, జిల్లా కేంద్రాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యాలు దెబ్బ‌తిన్నాయ‌ని వీటిని వెంట‌నే పున‌రుద్ద‌రించేలా ఆదేశించామ‌న్నారు. జిల్లాల్లో రెవెన్యూ. పోలీసు యంత్రాంగం చిత్త‌శుద్దితో 24X7 ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. గురువారం నాడు విప‌త్తుల నిర్వ‌హ‌ణా శాఖ అధికారుల‌తో మంత్రిగారు స‌మీక్షించారు. అలాగే మెద‌క్ కామారెడ్డి సిరిసిల్ల నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు.

వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిట‌రింగ్ చేసుకోవాల‌ని సూచించారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం పట్టిన త‌ర్వాత న‌ష్టాన్ని అంచ‌నా వేయాల‌ని సూచించారు. వ‌ర్షాల‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను అన్నివిధాలా ఆదుకుంటామ‌ని తెలిపారు. రాష్ట్రంలో వ‌ర్ష బీభ‌త్సం దృష్ట్యా ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ప‌ని చేస్తున్నాయ‌ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి హెలికాప్ట‌ర్‌ల ద్వారా బాధితుల‌ను ఆదుకోవ‌డానికి సిద్ధం చేశామ‌ని వివ‌రించారు. కూలి పోయిన ఇండ్లు, న‌ష్ట‌పోయిన రైతులను ఆదుకుంటామ‌ని మంత్రిగారు ప్ర‌క‌టించారు. ఒక్క మెద‌క్‌, సంగారెడ్డి జిల్లాల్లో కేవ‌లం ఒక గంట వ్య‌వ‌ధిలో 700 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కార‌ణంగా నీటి వ‌న‌రులు పూర్తిగా నిండిపోయాయ‌ని, వాట‌ని నుంచి ఉధృతంగా నీరు బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో గ‌ట్లు దెబ్బ‌తిని తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించింద‌ని వివ‌రించారు.మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లోని తండాలు మ‌రీ ఎక్కువ‌గా వర్ష బీభ‌త్సానికి గుర‌య్యాయ‌ని, ఈ తండాల‌కు తాగునీరు, విద్యుత్ సౌక‌ర్యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా క‌ల్పించేలా అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. వ‌ర్షాల త‌ర్వాత వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశాలు ఉన్నందున ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య‌శాఖ‌కు సూచించామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే.. ప్ర‌తిప‌క్ష‌మైన బి.ఆర్‌. ఎస్ రాజ‌కీయ ల‌బ్దికోసం మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. వారి పాల‌న‌లో వ‌ర‌ద‌లొస్తే నాడు ఏం చేశారో.. నేడు ఏం జ‌రుగుతుందో కళ్ల‌కు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అన్నారు. శ‌వాల మీద చిల్ల‌ర ఏరుకునే వ్య‌వ‌హారం చేయ‌వ‌ద్ద‌ని, ఉప‌యుక్త‌మైన స‌ల‌హాలు ఇస్తే స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.