- అధిక వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై ఆరా తీసిన మంత్రి..
- ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్షించిన మంత్రి
- కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
- రోడ్లు, కల్వర్టులు తెగిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం
- ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలి
- తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద వర్షాలు,వరదలు తగ్గుముఖం పట్టగానే తాత్కాలిక మరమ్మతులు చేపడతాం.
- పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
- ఆర్ అండ్ బి హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలు అడిగిన మంత్రి
- స్టేట్ రోడ్స్ సి.ఈ ఆధ్వర్యంలో షిఫ్టుకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బి డివిజన్ల నుండి వివరాలు సేకరణ
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులను అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. గురువారం నాడు ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆర్ అండ్ బి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్షించిన మంత్రి, కాజ్ వే లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి, నిర్మల్ వద్ద వరద ప్రవాహానికి NH 44 పై రాకపోకలకు ఏర్పడిన అంతరాయం, ట్రాఫిక్ క్లియరెన్స్ పై మంత్రి ఆరా తీసి.. నేషనల్, స్టేట్ హైవేల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు, కల్వర్టుల, ముఖ్యంగా ఇంకా రెడ్ అలెర్ట్ ఉన్న జిల్లాల రోడ్ల వివరాలు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రోడ్లు తెగిన చోట, కల్వర్టులు పొంగిపొర్లుతున్న చోట, వాగులు ఉదృతంగా ప్రవహించే మైనర్ బ్రిడ్జిల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని, తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద వర్షాలు తగ్గుముఖం పట్టగానే తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ అండ్ బి హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై మంత్రి ఆరా తీయగా.. స్టేట్ రోడ్స్ సి.ఈ ఆధ్వర్యంలో షిఫ్టుకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి గత రివ్యూలో చెప్పిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బి డివిజన్ల నుండి వివరాలు సేకరణ చేస్తున్నామని, 24 గంటలు అలెర్ట్ గా ఉంటున్నామని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ మంత్రికి తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బి పరిధిలోని 37డివిజన్లలో 794 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని,అందులో 1039 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 31 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఆర్ అండ్ బి) మంత్రికి వివరించారు. 356 చోట్లలో కాజ్ వే లు,కల్వర్టులు వరద ప్రవాహం ఉంటే అందులో 289 దారి మళ్లింపు చేసినట్లు పేర్కొన్నారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 305 ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన 236చోట్ల క్లియర్ చేశామని,మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. మొత్తంగా 206 చోట్ల సిడి వర్క్స్ దెబ్బతిన్నాయని, రోడ్లు, కాజ్ వే,మైనర్ బ్రిడ్జి లు, కల్వర్టులు తాత్కాలికంగా,శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక పునరుద్ధరణకు 53.76 కోట్లు వరకు ఖర్చు అవుతుందని, శాశ్వత పునరుద్ధరణ కోసం 1157.46 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఆర్ అండ్ బి అధికారులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు, క్షేత్ర స్థాయిలో చూపిన పని తీరును అభినందించిన మంత్రి, అలసత్వం వహించకుండా.. అదే స్పూర్తితో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తూ..పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఏ రోజుకు ఆరోజు వివరాలు ఉదయం, సాయంత్రం తనకు రిపోర్ట్ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.