- సెప్టెంబర్ నెలలో రైతుల అవసరాలను తీర్చేందుకు తక్షణమే అదనపు యూరియా కేటాయింపులు చేయాలని, కేంద్ర మంత్రి నడ్డాకి మంత్రి తుమ్మల లేఖ
- పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
RFCL లో యూరియా ఉత్పత్తి ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం యూరియా సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. రానున్న రెండు రోజులలో రాష్ట్రానికి IFFCO-Phulpur, NFL, MCFL, KRIBHCO, CIL, PPL కంపెనీల నుండి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అన్నారు. ఈ యూరియా రాష్ట్రంలోని గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుటుందని, అక్కడి నుండి డిమాండ్ పరంగా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలోగా IPL, CIL కంపెనీల నుండి దామ్ర, గంగవరం, కరాయికల్ పోర్టుల ద్వారా మరో 27,950 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, ఈ యూరియా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్, జగిత్యాల, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకోనుందని అన్నారు.
కేంద్ర మంత్రి నడ్డాకి లేఖ….
సెప్టెంబర్-2025 నెలలో రైతుల అవసరాలను తీర్చేందుకు తక్షణం అదనపు యూరియా కేటాయింపులు చేయాలని, కేంద్ర మంత్రి నడ్డాని లేఖ ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వరి పంటకు మొదటి, రెండవ విడతల యూరియా వేయడం జరుగుతోందని, త్వరలో మూడవ విడతతో పాటు ఎం.ఓ.పీ. వాడకం కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం వరి పంటకే సెప్టెంబర్ నెలలో 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రాష్ట్రానికి 2.38 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని మంత్రి తెలిపారు. ఈ లోటు రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూరియా స్టాక్ కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమేనని, రోజుకు 9,000 నుండి 11,000 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎరువుల శాఖ (DoF) రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని, అలాగే సెప్టెంబర్ నెలకు ఇప్పటికే ఆమోదించిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు తోడుగా ఈ అదనపు కేటాయింపును మంజూరు చేయాలని మంత్రి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాక, కాకినాడ పోర్టుకు చేరనున్న OBE LOTUS నౌకలోని 47,500 మెట్రిక్ టన్నులు మరియు గంగవరం పోర్టుకి చేరనున్న రెండు నౌకల (MV AM OCEAN Freight – 45,000 MTs, Magda – 44,000 MTs) నుండి 20,000 మెట్రిక్ టన్నుల యూరియా చొప్పున రాష్ట్రానికి మంజూరు చేయాలని అభ్యర్థించారు.
పంట నష్టం సమగ్ర నివేదిక….
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని మంత్రి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను మంత్రిగారు అప్రమత్తం చేశారు. జిల్లాలలోని రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులపై మంత్రిగారు ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగి వాగులు, కల్వర్టుల దగ్గర నీటి ప్రవాహాం పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.