ఏసీబీ అదుపులో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు

  • రూ. 60 కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు..?

అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏక కాలంలో ఎనిమిది చోట్ల తనిఖీలు నిర్వహించి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. కాజీపేట చైతన్యపురిలోని నాగేశ్వర్‌రావు నివాసంతో పాటుగా ఖ మ్మం జిల్లా కేంద్రంతోపాటు కొణిజర్ల, చింతకాని, బోనకల్‌తోపాటు ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కాజీపేట చైతన్యపురిలోని ఆయన నివాసంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నట్టు కనుగొన్నారు. 17 ఎకరాల వ్యవసాయ భూ ముల పత్రాలు, రూ.23 లక్షల విలువైన ఆభరణా లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ రూ.60 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. తనిఖీల అనంతరం నాగేశ్వర్‌రావును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆయన గతం లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హసన్‌పర్తి, ధర్మసాగర్‌, కాజీపేట మండలాల్లో పని చేశారు.

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్‌ జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కడంతో అక్కడి గ్రామస్తులు ఏకంగా పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లికి చెందిన ఓ వ్యక్తి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. దీంతో ఇంటికి నంబర్‌ కోసం పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు వద్దకు వెళ్లగా, రూ. 20 వేలు ఇస్తేనే జారీ చేస్తానని చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించి విషయం చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం బాధిత వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న నాగరాజును ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. దీంతో అతను పనిచేసే గ్రామంలో స్థానికులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.