సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగి.. బీసీలకు రాష్ట్ర స్థానిక సంస్థల్లో 42ు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ‘‘రిజర్వేషన్లు పార్లమెంట్ పరిధిలోని అంశం. అంతేగానీ, అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడినా.. పొలిటికల్ డైలాగులు కొట్టినా లాభం లేదు. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. అందుకు మేం సహకరిస్తాం. కాంగ్రె్స-బీజేపీ తలచుకుంటే.. మోదీ-రాహుల్ కలిసి టీ తాగేలోపు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి, బీసీలకు న్యాయం చేయొచ్చు. పార్లమెంట్ ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే పరిష్కారం’’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసినా.. ఆ దిశలో ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణతో 50ు రిజర్వేషన్ల పరిమితిని తొలగించేందుకు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో 5 రకాలుగా మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘‘కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి ఉండాల్సింది. అలా చేయకుండా.. హడావుడిగా ప్రకటించి, ఇప్పుడు చిత్తశుద్ధి లేనట్లు వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను సాధిస్తామని ఒకసారి చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా అంటూ మరోసారి చెప్పారు. పార్టీపరంగా అని ఇంకోసారి.. రాహుల్ ప్రధాని అయితేనే అని మరోమారు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ బిల్లు తీసుకొచ్చారు. ఒకే అంశంపై ఐదు రకాలుగా చెబుతుంటే.. బీసీలు అర్థం చేసుకోలేరా?’’ అని ప్రశ్నించారు. గతంలో పంపిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేయలేదని, ఇప్పుడు శాసనసభ తీర్మానంపై ఎలా ఆమోదం వ్యక్తం చేస్తారని నిలదీశారు. ‘‘మార్చి నెలలో అసెంబ్లీ ఆమోదించి, రాష్ట్రపతికి పంపిన బిల్లుకు.. తాజా బిల్లుకు తేడా ఏంటో చెప్పాలి. సెప్టెంబరు 30లోపు రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలను ఎలా పూర్తిచేస్తారు? గవర్నర్‌తో సంతకం ఎలా చేయిస్తారు?’’ అనే విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కనీసం 15 రోజులైనా సభను నడపమని అడుగుతుంటే ప్రభుత్వం పారిపోతోందని ఎద్దేవా చేశారు.