కాళేశ్వరంపై సీబీఐ

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని వె లువరించారు. ఈ సందర్భంగా విచారణను సీబీఐకి అప్పగించడానికి కారణాలను ఆయన వివరించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నివేదికను జూలై 31న ప్రభుత్వానికి అందిస్తే… ఆగస్టు 4న మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి మంత్రివ ర్గం నిర్ణయంతో అసెంబ్లీలో పెట్టి, చర్చ చేపట్టాం. కమిషన్‌ క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. విచారణలో అనేక లోపాలు, అవకతవకలు గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల అంశాన్ని ప్రస్తావించింది. ప్లానింగ్‌ లేదని తేల్చింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్‌, నాణ్యత, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల లోపాలు ఏర్పడ్డాయని ఎన్‌డీఎ్‌సఏ గుర్తించింది. ఈ అంశాలపై మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎన్‌డీఎ్‌సఏ, కమిషన్‌ నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్‌, వ్యాప్కోస్‌ వంటి కేంద్ర సంస్థలు, పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ ఆర్థిక సంస్థలు పాల్పంచుకున్నందున ఈ కేసును సీబీఐకి అప్పగించడం సముచిత మని నిర్ణయంతీసుకున్నాం. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంటుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణకు అర్హమైన అంశాలు ఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. ధవళేశ్వరంపై ప్రాజెక్టు కట్టిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ను ప్రజలు కాటన్‌ దొర అని దేవుడిలా పూజిస్తుంటే.. దొరగా పుట్టానని గొప్పగా చెప్పుకొనే కేసీఆర్‌ .. తెలంగాణలో దోపిడీ దొంగగా మారారని ఆరోపించారు. కాళేశ్వరంలో ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ కుటుంబం రూ.లక్ష కోట్లు దోచుకుందని, రాష్ట్రప్రజలపై లక్షన్నర కోట్ల అప్పుల భారం వేసిందని అన్నారు. ప్రజాస్వామ్య దేశమైనందున.. కేసీఆర్‌ చేసిన పాపాలకు నడి బజారులో ఉరి తీయలేమని, రాళ్లతో కొట్టలేమని పేర్కొన్నారు. అందరి అనుమతితో నిర్ణయం తీసుకోవాలనే ఈరోజు అర్ధరాత్రి సమావేశం పెట్టామన్నారు.