- రెవెన్యూ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా ఒకే సాప్ట్వేర్
- రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలు అందించడానికి వీలుగా అవినాభావ సంబంధమున్న రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్ వేర్‌ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ ను జతచేయాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని భూభారతి పోర్టల్ సర్వే మ్యాప్ లింక్ చేసేలా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది పరుస్తున్నామని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం ఈ అంశంపై రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగం, ఎన్ఐసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ భూ భారతి పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ది చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలన్నారు.
నక్షా లేని ఐదు గ్రామాలలో రీసర్వే కొలిక్కివచ్చిన నేపధ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో మరి కొద్ది రోజుల్లోనే రీసర్వేను ప్రారంభించబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు, సిసిఎల్ఎ కార్యదర్శి మంధా మకరంద్. ఎన్.ఐ.సి. ఎస్.ఐ.ఓ ప్రసాద్, విజయ్‌మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.