1070 హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్‌ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఫిర్యాదులకు మరో మూడు..
ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన ఆస్తుల కబ్జాపై 8712406899 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌ ద్వారా పంపాలని రంగనాథ్‌ సూచించారు. వరద సమస్యలు, విపత్తులపై ఇప్పటికే అందుబాటులో ఉన్న 8712406901, 9000113667 నంబర్లకూ సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.