నిమజ్జనోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి

 ఎలాంటి హంగు లేదు.. ఆర్భాటమూ లేదు. పోలీసుల హడావుడీ లేదు. కాన్వాయ్‌ లేదు.. ఎప్పుడూ వెంట ఉండే భద్రతా సిబ్బందీ లేరు.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సాదాసీదాగా, ఓ సామాన్యుడిలా, వేలమంది భక్తజనంలో తానొకరు అన్నట్లుగా హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిమజ్జన కార్యక్రమానికి విచ్చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించి భక్తుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం అనంతరం సాయంత్రం 4:15 గంటలకు మూడు వాహనాలతో ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా రేవంత్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నారు. సీఎం కనిపించడంతో అక్కడ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రేవంత్‌ సింపుల్‌గా, తమలో ఒకరిగా పక్కనే ఉండటాన్ని చూసి ఆయన్ను భక్తులు ఫొటోలు తీశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తొలుత.. వాహనం దిగగానే రేవంత్‌, అక్కడ.. కుమారుడితో నిల్చున్న ఓ మహిళకు అభివాదం చేశారు. ఆ బాలుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. క్రేన్‌ నంబరు-4 వద్దకు చేరుకొని నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన హుస్సేన్‌సాగర్‌ తీరాన ఏర్పాట్లు, నిమజ్జనం జరుగుతున్న తీరును ఆయనకు వివరించారు. ఎన్టీఆర్‌మార్గ్‌ నుంచి భక్తులను పలకరిస్తూ.. వారికి అభివాదం చేస్తూ, కొందరితో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సచివాలయం ముందు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడే స్వాగత వేదిక ఏర్పాటు చేసిన భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వహకులు వేదిక మీదకు సీఎంను ఆహ్వానించారు. వేదిక మీదకు చేరిన రేవంత్‌ను భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడి కండువా వేసి సన్మానించారు. వేదికపై నుంచి రేవంత్‌, భారీగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. గడిచిన 45ఏళ్లలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి ఏ సీఎం రాలేదని, ఉత్సవ సమితి వేదికపైకి వచ్చిన మొట్టమొదటి సీఎం రేవంత్‌ అని భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రకటించారు.

‘జై బోలో గణేశ్‌ మహారాజ్‌కీ’ అంటూనే ‘సీఎం రేవంత్‌ రెడ్డికి జై’ అంటూ నిర్వాహకులు నినదించగా.. సీఎం వారించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడాలంటూ నిర్వాహకులు కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. వేదిక మీద నుంచే గణపతి బప్పా మోరియా అంటూ నినదించారు. నిమజ్జనానికి ఏమైనా ఇబ్బందులున్నాయా? అని ఉత్సవ సమితి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌మార్గ్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డులో నిమజ్జన కార్యక్రమంలో నిమగ్నమైన సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని సూచనలు చేశారు. గత ఏడాది జరిగిన నిమజ్జనోత్సవానికి కూడా రేవంత్‌ హాజరయ్యారు. అప్పట్లో ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం జరగడానికి ముందే ఏర్పాట్లను పరిశీలించి.. క్రేన్ల ఆపరేటర్లతో మాట్లాడారు. ఈ సారి అందుకు భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం పూర్తయ్యిన తర్వాత వచ్చారు.