హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని చోట్ల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలు మోహరించాయని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో కీలకమైన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ జితేందర్ చెప్పారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందని.. నాలుగు గంటల్లోపు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ వివరించారు.
వినాయక నిమజ్జనం రేపటి(ఆదివారం) వరకు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. ప్రజలు కూడా త్వరగా నిమజ్జనం పూర్తి చేసేందుకు సహకరించాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అదనంగా ప్రత్యేక ఫోర్స్ విధుల్లో ఉందని తెలిపారాయన. డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్ లోని ఐసీసీసీ లో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈసారి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిమజ్జనం విధుల్లో పాల్గొందని డీజీపీ తెలిపారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్పీఫ్, ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని చెప్పారు.