హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీ సీజ్.. రూ. 12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

హైద‌రాబాద్ కేంద్రంగా భారీగా డ్ర‌గ్స్ దందా కొన‌సాగుతోంది అన‌డానికి ఈ ఫ్యాక్ట‌రీనే ఉదాహ‌ర‌ణ‌. వేల కోట్ల రూపాయాల్లో డ్ర‌గ్స్ దందా చేస్తున్న‌ట్లు తేలింది.  బంగ్లాదేశ్‌కు చెందిన డ్ర‌గ్స్‌తో మ‌హారాష్ట్ర పోలీసులకు ప‌ట్టుబ‌డ‌డంతో.. ఆమెను విచారించగా ఈ డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్ వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేంద్రంగా ఈ ఫ్యాక్ట‌రీ నుంచి ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల డ్ర‌గ్స్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. తాజాగా జ‌రిపిన దాడుల్లో రూ. 12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆ ఫ్యాక్ట‌రీని సీజ్ చేశారు.

మేడ్చ‌ల్ జిల్లాలో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్ గుట్టుర‌ట్టు అయింది. డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌పై మ‌హారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఎండీ డ్ర‌గ్స్ త‌యారీలో వినియోగించే 32 వేల లీట‌ర్ల ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిథైలెనెడియాక్సీ, మెథాంఫెటమైన్ వంటి ముడి ప‌దార్థాల‌ను సీజ్ చేశారు. ఈ ఫ్యాక్ట‌రీలో త‌యారైన డ్ర‌గ్స్ వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు తేలింది. దేశంతో పాటు విదేశాల‌కు కూడా ఎండీ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు గుర్తించారు. ఎక్స్‌టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్ల‌తో డ్ర‌గ్స్‌ను నిందితులు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. డ్ర‌గ్స్ త‌యారీ యూనిట‌క్‌కు చెందిన 13 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి సుమారు రూ. 12,000 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

గ‌త నెల‌లో మ‌హారాష్ట్ర పోలీసులకు బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డింది. ఆమె నుంచి రూ. 25 ల‌క్ష‌ల విలువైన డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇచ్చిన స‌మాచారంతో మ‌హారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ప‌క్కా స‌మాచారంతో ఇవాళ మేడ్చ‌ల్‌లో దాడులు చేసి.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.