ఉద్యోగులకు సంబంధించి EHS విధి విధానాలు సిద్ధం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి EHS (Employees Health Scheme) విధి విధానాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత EHS విధి విధానాలపై సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం సీనియర్ ఐఏఎస్ అధికారులతో సి.ఎస్ సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను, ఇన్సురెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాద్యమైనంత త్వరలో నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుండి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నగదు రహిత ఆరోగ్య చికిత్స విధానం ద్వారా (Cashless Treatment) ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం కలిపి 7 లక్షల 14 వేల 322 మంది EHS (Employees Health Scheme) ద్వారా లబ్ధి పొందనున్నారని, ఈ పథకం కోసం సంవత్సరానికి సుమారు రూ.1300 కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ధిక శాఖ అధికారులు సమన్వయంతో ఆయా రాష్ట్రాలలో కొనసాగుతున్న EHS విధి విధానాలను ఆధ్యయనం చేసి త్వరలో నివేదికను సిద్ధం చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రాణా ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా చోంగ్తు, , GAD కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.