హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి నీళ్ళు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గండిపేట మండలం ఉస్మా న్ సాగర్ వద్ద రూ.7360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న గోదావరి త్రాగునీటి సరఫరా పథకం ఫేస్ -2, 3 శంకుస్థాపన కు ముఖ్యమంత్రి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమని, కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని గుర్తు చేశారు. 1965లో మంజీరా నది నుంచి, 2002లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని వివరించారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని, నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని ముఖ్యమంత్రి తెలిపారు.

కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా వాసులు ఫ్లోరైడ్, ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చానని, ఇందుకోసం మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని, ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నామని, ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం, 4 టీఎంసీల ను చెరువులను నింపుకుంటూ మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేయలేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం, ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారని అన్నారు. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని, అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తామని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుందని ఆయన తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందిని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, కోటిన్నరకు పైగా జనాభా ఉన్న నగరానికి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకురావడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ నగరానికి నిజాం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. రాష్ట్రం వచ్చిన పదేళ్లలో గత ప్రభుత్వం గోదావరి నుంచి చుక్క నీరు అందించలేదన్నారు.

జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని , మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జంటనగర వాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, నగరవాసులకు అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మా సంకల్పమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.