12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

  • ఆర్ఆర్ఆర్ (నార్త్) ప‌నుల ప్రారంభానికి అనుమ‌తులు ఇవ్వండి
  • మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించండి
  • హైద‌రాబాద్‌-మంచిర్యాల మ‌ధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయండి
  • జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విన‌తి

ఢిల్లీ: భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కూడా తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మించాల్సి ఉంద‌ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ‌కు స‌ముద్ర రేవు లేనందున.. బంద‌రు పోర్ట్ వ‌ర‌కు స‌ర‌కు ర‌వాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయాల‌ని కోరారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిలో 118 కిలోమీటర్లు తెలంగాణ‌లో ఉంటుంద‌ని… మిగ‌తా భాగం ఏపీలో ఉంటుంద‌ని సీఎం వివ‌రించారు. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం రాత్రి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో ప‌లు జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, అనుమ‌తులు, ప‌నుల వేగ‌వంతంపై కేంద్ర మంత్రితో చ‌ర్చించారు.

హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్‌) 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్తయినందున వెంట‌నే ఫైనాన్షియ‌ల్‌, క్యాబినెట్ అనుమ‌తులు ఇచ్చి ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆర్ఆర్ఆర్ (నార్త్‌)కు స‌మాంత‌రంగా ఆర్ఆర్ఆర్ (సౌత్‌) ప‌నులు చేప‌ట్టాల‌ని..ఇందుకుగానూ వెంట‌నే అన్ని అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌ను ప్ర‌సిద్ధ శైవ క్షేత్రం శ్రీ‌శైలంతో అనుసంధానించే మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం ర‌హ‌దారి అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ప‌రిధిలో ఉన్నందున నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్త‌యితే ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరుల‌కు రాక‌పోక‌లు సులువవుతాయ‌ని సీఎం తెలిపారు. రావిర్యాల‌-ఆమ‌న్‌గ‌ల్‌-మ‌న్న‌నూర్ నాలుగు వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని నిర్మించాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

హైద‌రాబాద్‌-మంచిర్యాల మ‌ధ్య ఉన్న రాజీవ్ ర‌హ‌దారిపై వాహ‌న ర‌ద్దీ అధికంగా ఉన్నందున హైద‌రాబాద్‌-మంచిర్యాల మధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్ల‌తో పంపిన ర‌హ‌దారుల ప‌నులను మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ ప‌నుల‌కు వారంలోపు అనుమ‌తులు ఇస్తామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ-అమ‌రావ‌తి-బంద‌రు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి సంబంధించి త‌మ శాఖ అధికారుల‌ను హైద‌రాబాద్‌కు పంపుతాన‌ని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌హెచ్‌, ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌తో ఈ నెల 22వ తేదీన హైద‌రాబాద్‌లో స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి తెలిపారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, రేణుకా చౌద‌రి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కే.ఎస్‌.శ్రీ‌నివాస రాజు, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌, పీసీసీఎఫ్ డాక్ట‌ర్ సి.సువ‌ర్ణ‌, కేంద్ర ప్రాజెక్టులు, ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.