గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ: మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్

హైద‌రాబాద్ : ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి స‌మీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు మంత్రులు సూచించారు.

భక్తులకు మరింత సౌకర్యవంతముగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనుల్లో గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని, ఈ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే మేడారం ఆల‌యాల‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించార‌ని, వచ్చే వారంలో ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్ధాయి ప‌రిశీల‌న‌కు వ‌స్తున్నందున త‌గు ప్రణాళిక‌లు, స‌మాచారంతో సిద్దంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.