అక్రమ మద్యం, డ్ర‌గ్స్, గంజాయి,ర‌వాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కు పాదం మోపండి : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారుల ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమ మద్యాన్ని, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కు పాదం మోపాలని ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకుగాను సరిహద్దు రాష్ట్రాల అధికారుల‌తో సమన్వయంతో పాటు వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి వారిని పిడి యాక్టు కింద అరెస్టు చేయాలని ఆదేశించారు.

యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న గంజాయి, మాద‌క‌ద్ర‌వ్యాల‌ లాంటి మత్తు పదార్ధాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అన్నారు. డ్ర‌గ్స్, సింథ‌టిక్ డ్ర‌గ్స్, గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా, క‌ల్తీ క‌ల్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నార‌ని, ప్రజల ప్రాణాలు తీసేవి ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ని, త‌ద్వారా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడాల‌ని అన్నారు. నిఘా, విస్తృత త‌నిఖీల‌ను చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌రింత అప్ర‌మ‌త్త‌తో ప‌ని చేయాల‌ని దిశానిర్ధేశం చేశారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. నిఘాను కేవలం చెక్కు పోస్టులకే పరిమితం కాకుండా ఆయా గ్రామాల్లోని ఇతర మార్గాలు, సోర్సులపై కూడా నిఘాను ముమ్మరం చేసి దీనిలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎక్సైజ్ శాఖ అధికారుల‌కు ఆయ‌ధాలు అప్ప‌గించే అంశంలో నిబంధ‌న‌లు ఏం చెప్పుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు ఏంటీ? ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్క‌డైనా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు అప్ప‌గించారా? దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, నాటుసారా తయారీ అమ్మకాలు, కల్తీ మద్యం తయారీతో పాటు ఎన్డీపీఎస్ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడమే కాకుండా, నమోదు చేసిన కేసుల్లో ఎంత‌మంది నిందితుల‌కు పడుతున్నాయి? అని ఆరా తీశారు. కేసు న‌మోదు, పంచానామా నుంచి చార్జిషీట్ దాఖ‌లు, ట్ర‌య‌ల్ సంద‌ర్భంలో స‌మ‌ర్ద‌వంతంగా వాద‌న‌లు వినిపించి నిందితుల‌కు శిక్ష‌లు ప‌డే వ‌ర‌కు విశ్ర‌మించ‌కుండా ప‌ని చేయాల‌ని సూచించారు.

చ‌ర్ల‌ప‌ల్లిలోని ఓ ప్యాక‌ర్టీలో డ్ర‌గ్స్ ముడిస‌రుకు త‌యారీ కేసులో పురోగ‌తి, ఎక్సైజ్ శాఖ త‌నిఖీ, బ‌య‌ట‌ప‌డ్డ అంశాల‌పై ఇచ్చిన నివేదిక గురించి మంత్రి ఆరా తీశారు. మ‌హ‌రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో ఏముంద‌ని అడిగారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులు, ఇతర వస్తువుల విలువ రూ. 12,000 కోట్లుగా వార్తలు వ‌చ్చాయ‌ని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవ‌ని, స్వాదీనం చేసుకున్న వాస్త‌వ విలువ గురించి మ‌హారాష్ట్ర పోలీసుల నుంచి ఇంకా తెలియాల్సి ఉంద‌ని, విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వాటి విలువ సుమారు 11.95 కోట్లు మాత్ర‌మేన‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. చ‌ర్ల‌ప‌ల్లి వంటి ఘ‌ట‌న‌ల వ‌ల్ల మ‌న విశ్వ‌నీయ‌త‌ను కొల్పేయే ప్ర‌మాదం ఉంద‌ని, భ‌విష్య‌త్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా నిఘాను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్లో విస్తృత సోదాలు నిర్వ‌హించాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ఇత‌ర శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు.

గోవాలో పెన్నీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఇప్ప సారా (మ‌హూవా) వంటి సాంప్ర‌దాయ మ‌ద్యాన్ని బ్రాండింగ్ చేసి విక్ర‌యిస్తున్నార‌ని, తెలంగాణ‌లో ఈత‌, తాటి క‌ల్లును కూడా అదే త‌ర‌హాలో టొడి నేచుర‌ల్ బ్రూవ‌రి నెల‌కొల్పి బాట్లింగ్ చేసి విక్ర‌యించే యూనిట్ ల‌ను నెల‌కొల్ప‌డం వ‌ల్ల‌ గీత కార్మికుల‌కు ఉపాధితో పాటు ఆదాయం పెరుగుతుంద‌ని, క‌ల్తీ క‌ల్లును కూడా నివారించ‌వ‌చ్చ‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. నివేదిక ఆధారంగా సీయం రేవంత్ రెడ్డితో చ‌ర్చించి నిర్జయం తీసుకుంటామ‌ని అన్నారు. దాడుల సంద‌ర్భంలో స్వాదీనం చేసుకున్న న‌ల్ల‌బియ్యాన్ని వృధాగా పార‌బోయ‌కుండా దాన్ని రైతులకు విక్ర‌యించ‌డానికి ఉన్న నిబంధ‌న‌లు ఎంటి? అదే విధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ ను ద్వంసం చేయ‌కుండా, దాని నాణ్య‌త‌ను ల్యాబ్ లో ప‌రీక్షించి, తిరిగి విక్ర‌యించేందుకు ఉన్న అడ్డంకులు, నిబంధ‌న‌లు ఎంట‌నేదానిపై అధ్య‌య‌నం చేయాల‌ని సూచించారు. ఫంక్ష‌న్ హాల్స్, రిసార్టు, ఫాంహౌస్ ల్లో జ‌రిగే ప్రైవేట్ పార్టీల్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపై అబ్కారీ శాఖ దృష్టి సారించాల‌ని అన్నారు. ఈ క్రమంలో ఫంక్షన్లు, పార్టీలపై కూడా అబ్కారీ శాఖ ఓ కన్నేసి ఉంచాల‌ని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా పెట్టాల‌ని, ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోని వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ఒక బారుకు అనుమ‌తి తీసుకుని , రెండు మూడు బార్ల‌ను న‌డుపుతుండ‌టంతో పాటు ఒక అంత‌స్తులో బారు న‌డ‌ప‌డానికి అనుమ‌తి తీసుకుని రెండు, మూడు అంత‌స్తుల్లో బార్ల‌ను న‌డుపుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. తూతూమంత్రంగా కంపౌండ్ ఫీజు వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా నిబంధ‌ల‌ను అతిక్ర‌మించిన బార్ల లైసెన్స్ ల‌ను ర‌ద్దు చేయాల‌ని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చ‌రించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్‌ సి.హరి కిరణ్‌, ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం, అడిషనర్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీ, అన్ని జిల్లాల‌ డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ఎస్టిఎఫ్, డిటిఎఫ్ టీమ్స్ అధికారులు పాల్గొన్నారు.