మరో పాస్ పోర్ట్ కేంద్రం అవసరం: మంత్రి శ్రీధర్ బాబు

  • నగరంలో ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలి
  • రాయదుర్గ్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం” ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ లో కొత్తగా మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం రాయదుర్గ్ పాస్‌ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజు రోజుకీ పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలు అందాలంటే మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏటా దేశవ్యాప్తంగా సగటున కొత్త పాస్‌పోర్ట్ కోసం కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇందులో తెలంగాణ వాటా సుమారు 11 లక్షల వరకు ఉంటుందన్నారు. గతంలో పాస్‌పోర్ట్ కోసం నెలల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కొత్త పాస్ పోర్ట్ సేవా కేంద్రం నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సికింద్రాబాద్ ఆర్పీవో స్నేహజ తదితరులు పాల్గొన్నారు.