- పేద, మధ్యతరగతి, రైతాంగ వర్గాల మేలు కోసం విధాన నిర్ణయం
- జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర వహించాను
- తగ్గుతున్న వస్తువుల ధరలను వ్యాపారులు దుకాణాల ముందు ప్రదర్శించాలి
- వ్యాపారుల సమస్యలు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచే ఉన్నాయి
జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.. అయినప్పటికీ పేద, మధ్యతరగతి రైతాంగ కుటుంబాల మేలు కోసం జిఎస్టి రేషినేలైజేషన్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ ఒక విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వ్యాపార వర్గాలతో డిప్యూటీ సీఎం ఇంట్రాక్షన్ కార్యక్రమం కమర్షియల్ టాక్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఎదుగుదల కోసం ప్రజా ప్రభుత్వం ఐదువేల కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ జీఎస్టీ రేట్ల సవరణ విధాన నిర్ణయంలో ప్రధాన భూమిక పోషించింది అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాదిమందికి ఉపయోగపడే కార్యక్రమం అన్నారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, వ్యాపారులు అందరిపైనా ఉంది అన్నారు. జీఎస్టీ లో సులభమైన విధానం తెచ్చేందుకు ఢిల్లీలో సుధీర్గ చర్చలు జరిగాయి, భేషజాలకు పోకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం, వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుంది అన్నారు.
పనుల విధానం సరళంగా, సక్రమంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు మనసు కష్ట పెట్టుకోకుండా రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల ధరల వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలి అని డిప్యూటీ సీఎం కోరారు.
జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ తర్వాత, అంతకుముందు వివిధ వస్తువుల ధరలు ఏ విధంగా మార్పు జరిగిందో వ్యాపారులు తమ దుకాణాల ముందు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా ప్రదర్శించాలని డిప్యూటీ సీఎం కోరారు. జీఎస్టీ రేట్ల సవరణతో వ్యవసాయ రంగానికి అవసరమైన పరికరాల ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. సిమెంట్ జీఎస్టీ స్లాబ్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు, ఫలితంగా సిమెంటు ధరలు తగ్గుతాయి అన్నారు. సిమెంటు ధరలు తగ్గడంతో నిర్మాణరంగం భారీగా పెరుగుదలకు అవకాశాలు ఏర్పడతాయి అని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ ఒక నగర రాజ్యాంగ మారుతుంది, రాష్ట్రవ్యాప్తంగా అర్బనైజేషన్ పెరుగుతుంది తద్వారా ఇన్ఫ్రారంగం వ్యాపారాన్ని వ్యవస్థీకృతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తగ్గుతున్న సిమెంటు ధరల వివరాలను వ్యాపారులు తమ దుకాణాల ముందు ప్రదర్శించాలని కోరారు.
ITC (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్) వాస్తవంగా వ్యాపారం చేసే వారికి ఇది ఉపయోగకరం అడ్డదారులు తొక్కే వారి వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. నిబద్ధతతో స్వచ్ఛంగా వ్యాపారం చేసేవారు అడ్డదారులు తొక్కే వ్యాపారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని డిప్యూటీ సీఎం వ్యాపారులను కోరారు.
వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయి అని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చే సమస్యలను చర్చించి పరిష్కరించి సులభతరమైన వ్యాపారం చేసుకునే అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా కల్పిస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది, ప్రజలకు ఆ ఫలాలు చేరాలంటే వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ వారి అభిప్రాయంగా తెలియజేయాల్సిందిగా కోరారని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. బీమా, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వ్యాపారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
