
‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2020’ నివేదికలో వెల్లడి
దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146 జాతులు స్వల్పకాలిక ప్రమాదానికి అత్యంత చేరువలో ఉన్నట్టు తేలింది. దాదాపు 867 పక్షి జాతులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఆందోళనకర నిజాలను ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్-2020’ నివేదిక వెల్లడించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వలస జాతుల వన్యప్రాణుల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)’ 13వ సదస్సు సందర్భంగా సోమవారం ఈ నివేదికను విడుదల చేశారు. మిగతా పక్షి జాతులతో పోలిస్తే.. వలస సముద్ర పక్షులు, స్థానిక పక్షులు గత కొన్ని దశాబ్దాలుగా ఎక్కువగా ప్రభావితమయ్యాయని నివేదిక పేర్కొంది. గత 25 ఏండ్ల కాలంలో.. దాదాపు 261 జాతుల్లోని పక్షుల్లో 52% పక్షులు క్షీణించాయని.. స్వల్పకాలిక సమయంలో దాదాపు 146 జాతుల్లో 80% పక్షులు క్షీణించాయని.. ఇది ఇంకా కొనసాగుతున్నదని నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యానికి పుట్టినిల్లుగా పరిగణించే ప్రాంతాల్లో ఒకటైన పశ్చిమ కనుమలలో పక్షుల సంఖ్య 2000 సంవత్సరం నుంచి దాదాపు 75 శాతం తగ్గిందని వెల్లడించింది. జాతీయ పక్షి నెమలి జాతిలో అనూహ్య పెరుగుదల కనిపించిందని, ఇది సానుకూల అంశమని పేర్కొన్న నివేదిక.. నగరాల్లో పిచ్చుకల జనాభాలో గణనీయంగా క్షీణత కనిపిస్తున్నదని తెలిపింది.