- యూరియా సరఫరాలో సానుకూలంగా స్పందించిన కేంద్రం
- ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
రాష్ట్రంలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం యూరియా సరఫరాల కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రబీ పంటల సాగు కూడా ఆరంభం అవుతున్న ఈ సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా లో లోపం కలగకుండా చూసే చర్యలను ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే ప్రాధాన్యతగా తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర వినతులు, ఢిల్లీ వెళ్లి ప్రత్యక్షంగా మంత్రులను పలుమార్లు కలసి చేసిన అభ్యర్థనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి మొత్తం 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియా కేటాయింపును కేంద్రం ఆమోదించింది. ఈ కేటాయింపులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జైగడ్, కృష్ణపట్నం వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా యూరియా రాష్ట్రానికి చేరుతుంది. ఇందులో కాకినాడ నుండి 15,900 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం నుండి 37,650 మెట్రిక్ టన్నులు, గంగవరం నుండి 27,000 మెట్రిక్ టన్నులు, మంగళూరు నుండి 8,100 మెట్రిక్ టన్నులు, జైగడ్ నుండి 16,200 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం నుండి 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నాయి.
ఇప్పటికే సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రానికి 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యింది. కేంద్రం అదనంగా కేటాయించిన ఇంపోర్టెడ్ యూరియాలో ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు లోడింగ్‌లో ఉండగా, రాబోయే వారంలో మరో 50,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ పూర్తి కానున్నాయి. అలాగే 30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే ట్రాన్సిట్‌లో ఉన్నాయి. ఈ సరఫరా వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రధాన వనరుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం కీలకమైనది. గత 90 రోజులుగా ప్లాంట్ షట్‌డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిస్థితి రాష్ట్ర రైతులకు అంతరాయం కలిగించకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రి గారు స్వయంగా కేంద్ర రసాయనాల మంత్రిని, కార్యదర్శిని కలుసుకుని రామగుండం యూనిట్‌ను త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. “రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎరువుల కొరత లేకుండా, సాగుకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటోంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తూ ఉంటుంది” అని మంత్రి తెలిపారు.