ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో పాటు, పేషెంట్లకు అందించే డైట్ విధానంలో తీసుకు రావాల్సిన మార్పులు, ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త పాలసీల రూపకల్పనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం, జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, డైట్ పాలసీల్లో ఉన్న లోపాలను, ఆ లోపాల వల్ల ఎదురవుతున్న సమస్యలను డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ మంత్రికి వివరించారు. సెక్యూరిటీ టెండర్ నిబంధనల్లో సరియైన నియమాలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులుగా వృద్ధులను, ఫిజికల్ ఫిట్నెస్ లేని వారిని కాంట్రాక్టర్లు నియమిస్తున్నారని.. ఈ అంశంలో మార్పు తీసుకురావాలని అధికారులు మంత్రిని కోరారు. మొత్తం సెక్యూరిటీ సిబ్బందిలో కొంత శాతం మేర ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని నియమించాలని, ఇందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని అధికారులకు మంత్రి సూచించారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండి, 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారినే నియమించుకునేలా టెండర్ కండీషన్ ఉండాలన్నారు. సెక్యూరిటీ సూపర్వైజర్ పోస్ట్ ఉండాలని, ఈ పోస్టులో తప్పనిసరిగా రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఉండాలని మంత్రి ఆదేశించారు.
అన్ని హాస్పిటల్స్‌లో సీసీ టీవీ మానిటరింగ్ రూమ్ ఉండాలని, మానిటర్ చేసే పని కూడా సెక్యూరిటీ కాంట్రాక్ట్‌లో ఉండాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పేషెంట్ల రక్షణ, నియంత్రణ, హాస్పిటళ్ల నిర్వాహణపై సెక్యూరిటీ గార్డులకు ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి సూచించారు. హాస్పిటళ్లు పరిశుభ్రంగా ఉంచడంలో సానిటేషన్ సిబ్బందితో పాటు, సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కూడా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. సానిటేషన్ టెండర్లు పకడ్బంధీగా ఉండాలని, హాస్పిటల్ లోపల, బయట కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత సానిటేషన్ కాంట్రాక్టర్ల బాధ్యతగా ఉండాలన్నారు. హాస్పిటల్ పరిశుభ్రత విషయంలో శాస్త్రీయమైన పారామీటర్లు ఉండాలని, ఆయా నిబంధనల ప్రకారం హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. పెస్ట్ కంట్రోల్‌ను కూడా సానిటేషన్‌లో భాగం చేయాలని, సర్టిఫైడ్ పెస్ట్ కంట్రోలర్స్‌ను నియమించుకునేలా టెండర్ నిబంధనలు ఉండాలని మంత్రి సూచించారు. పేషెంట్లకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. డైట్ మెనూ తప్పనిసరిగా అమలు అయ్యేలా పర్యవేక్షణ ఉండాలని, ఆకస్మిక తనిఖీల కోసం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పేషెంట్ కేర్ వర్కర్లుగా క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే ఉండాలని మంత్రి సూచించారు. ఏఎన్ఎం, తదితర సూటబుల్ క్వాలిఫికేషన్లు ఉన్న వారికి అవకాశం ఇవ్వాలన్నారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు దక్కడంతో పాటు, పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.
పేషెంట్ కేర్ వర్కర్లలో కనీసం 60 శాతానికి తగ్గకుండా మహిళలు ఉండాలని మంత్రి సూచించారు. సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్లర్లకు కూడా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ఉండాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేయాలని, హాస్పిటల్ అవసరాలకు అనుగుణంగా ఏ షిఫ్ట్‌లో ఎంతమంది ఉండాలో స్పష్టమైన నిబంధనలు ఉండాలన్నారు. వర్కర్ల వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ల అక్రమాలకు అవకాశం ఉండొద్దని, క్యాష్ పేమెంట్ సిస్ట్మ్ పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి ఆదేశించారు. బ్యాంకు ఖాతాలోనే వేతనాలు జమ చేసేలా టెండర్ కండీషన్ ఉండాలని సూచించారు. ఆయా వర్కర్ల ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. సమావేశంలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ) డైరెక్టర్, డాక్టర్ శివలీల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.