మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

మేడారం మహాజాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కుంభమేళాకు కేటాయిస్తున్నట్లుగానే రూ.వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ములుగు జిల్లా మేడారం మహాజాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ప్రాంగణం పునఃనిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. పునఃనిర్మాణ మాస్టర్‌ప్లాన్‌పై ఆదివాసీలు, గిరిజనులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, అనంతరం మేడారంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘కుంభమేళాకు వేల వేల కోట్లు ఇస్తున్నారు. కానీ, మా ఆదివాసీ కుంభమేళాకు ఒక్క రూపాయి ఇవ్వడానికిగానీ, జాతీయ పండుగగా గుర్తించడానికిగానీ కేంద్రానికి ఎందుకో మనుసు రావడం లేదు. కుంభమేళా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మాత్రమే కాదు.. తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఉన్న సమ్మక్క, సారలమ్మ కూడా ఓ గొప్ప దేవాలయం. పోరాట పటిమకు, పౌరుషానికి మారుపేరు. రాచరికంపై తిరుగుబాటు చేసి.. జెండా ఎగురవేసిన సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు. పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తిగా నిలుస్తారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తల్లులను దర్శించుకుంటున్నానని తెలిపారు. 2023 ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచే పాదయాత్రకు పూనుకున్నానని, దొరల పాలన నుంచి ప్రజాపాలన తీసుకవస్తామని ప్రకటించానని తెలిపారు. ఆ తల్లుల దీవెనలతో ప్రజలు ఆశీర్వదించారని, నేడు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

సమ్మక్క, సారలమ్మ గద్దెల, ప్రాంగణ అభివృద్ధి పునఃనిర్మాణ కార్యక్రమం తనకు, మంత్రి సీతక్కకు ఈ జన్మలో లభించిన గొప్ప అవకాశమని సీఎం రేవంత్‌ అన్నారు. ఇది బాధ్యత కాదని, బాధ్యతతో కూడిన భావోద్వేగమని చెప్పారు. ఈ ఆలయ అభివృద్ధికి తాము ఎన్ని కోట్లయినా ఖర్చుపెడతామన్నారు. ప్రకృతి దేవతల చరిత్ర రాబోయే వందల, వేల ఏళ్లు నిలిచి ఉండేలా గద్దెలు, ప్రాంగణం పునఃనిర్మించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గిరిజనులు, ఆదివాసీల సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలని ఆలోచనతో పూజారులు, అదివాసీల అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడకు వచ్చానని అన్నారు. ఆదివాసీల సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా పునఃనిర్మాణ పనులు జరపాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆదివాసీలనూ భాగస్వాములను చేస్తామన్నారు. సిమెంట్‌తో కట్టిన ఏ కట్టడమైనా వందేళ్ల జీవితకాలమే ఉంటుందని, రాతితో నిర్మిస్తే వందల, వేల ఏళ్ల జీవితకాలం ఉంటుందని సీఎం తెలిపారు. అందుకే సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ప్రాంగణాన్ని రాతితో నిర్మించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పనులను వచ్చే ఏడాది జాతర ప్రారంభానికి ముందే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఆలయంతో పాటు జంపన్నవాగు, రహదారుల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ వీడియోను సభా వేదికపై ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రదర్శించారు. మాస్గర్‌ప్లాన్‌కు సభికుల నుంచి ఆమోదం తీసుకున్నారు.

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమని సీఎం రేవంత్‌ అన్నారు. ముఖ్యంగా ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు, గిరిజనుల ప్రాంతాలను అభివృద్ధిలో ముందుకు నడిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేశామని చెప్పారు. మేడారంలో ప్రస్తుతం ఉన్న దేవతల గద్దెలను ఒకే వరుసలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో నిర్మించనున్నారు. సమ్మక్క, సారలమ్మ పాత గద్దెలను ముట్టుకోకుండానే చుట్టూ గ్రానైట్‌తో సుందరీకరించనున్నారు. అలాగే సారలమ్మ గద్దె తరువాత వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను కొత్తగా నిర్మించనున్నారు. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో ఉన్న చెట్లతోపాటు ఏ కట్టడాన్నీ కూల్చకుండా సాలారాన్ని నాలుగు వైపులా 20 అడుగుల చొప్పున విస్తరించేలా రూపకల్పన చేశారు. నాలుగు ప్రవేశ ద్వారాలతో పాటు మరో నాలుగు బయటకు వెళ్లే ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు.