రాష్ట్రంలోకి 3,745 కోట్ల పెట్టుబడులు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • మూడు కంపెనీలకు ఆమోదం
  • 1,518 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు

రాష్ట్రంలో మరో మూడు భారీ కంపెనీలు రూ.3,745 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా 1,518 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వివరించారు. ఈమేరకు ఆ మూడు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. పరిశ్రమల ప్రోత్సాహక క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహేశ్వరంలో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న జేఎ్‌సడబ్ల్యూ యూఏవీ లిమిటెడ్‌కు, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌గేర్‌, బుషింగ్స్‌ ప్లాంటును ఏర్పాటు చేయనున్న తోషిబా ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంకు, హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ కంపెనీ యూనిట్‌ ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. భారీగా పెట్టుబడులు పెడుతూ యువత, పండ్ల సాగు రైతులను ప్రోత్సాహించేలా బహుళ జాతి కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయన్నారు. హిందుస్థాన్‌ కోకాకోలా యూనిట్‌ ద్వారా రూ.2,398 కోట్ల పెట్టుబడులు, 600 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. రూ.785 కోట్ల పెట్టుబడితో వస్తున్న జేఎ్‌సడబ్ల్యూ కంపెనీ ద్వారా 364 మందికి ఉపాధి లభిస్తుందని, రూ.562 కోట్ల పెట్టుబడితో వస్తున్న తోషిబా కంపెనీ ద్వారా 554 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. దావో్‌సతో పాటు వివిధ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చిన వివిధ కంపెనీల తాజా పరిస్థితి, జరిగిన ఎంవోయూలు, విధి విధానాలను క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమీక్షించింది.