హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను గురువారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సంఘం సభ్యులు శైలజ, మంగ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
