జిహెచ్ఎంసీ ప‌రిధిలో పేద‌ల‌కు త్వ‌ర‌లో తీపిక‌బురు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం కింద త్వ‌ర‌లో ఇండ్ల మంజూరు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నామ‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచ‌న మేర‌కు అపార్ట్‌మెంట్ త‌ర‌హాలు ఇండ్ల‌ను అందించేలా తీయ‌టి క‌బురు త్వ‌ర‌లో చెబుతామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి వెల్ల‌డించారు. జిహెచ్ఎంసీ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోగ‌ల ర‌సూల్ పుర‌లో 344 డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లను స‌హ‌చ‌ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎంపీలు ఈట‌ల రాజేంద‌ర్‌, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గ‌ణేష్ త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసినస‌భ‌లో మంత్రిగారు మాట్లాడుతూ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 30 నుచి70 గ‌జాలున్నాస‌రే స్ధానికంగా నివ‌సించే వారికి అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇండ్ల‌ను నిర్మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఈ ప్రాంతంలో మొండి గోడ‌ల‌తో ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేసి ఇస్తాన‌ని మాట ఇచ్చాన‌ని దానిని నెర‌వేర్చామ‌ని తెలిపారు.
నాటి ప్ర‌భుత్వంలో దొర‌వారు పేద‌ల‌కు ఇండ్లు క‌డితే క‌మీష‌న్లు రావ‌ని కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించార‌ని, ఆనాడు ఏడాదికి ల‌క్ష ఇండ్లు క‌ట్టినా పదేళ్ల‌లో ప‌దిలక్ష‌ల ఇండ్లు పేద‌ల‌కు వ‌చ్చేవ‌ని అన్నారు. కానీ పేద‌ల సంక్షేమ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా సాగుతున్న ఈ ప్ర‌జా ప్ర‌భుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా తొలివిడ‌త‌గా 4.50 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణానికి సంక‌ల్పించింద‌న్నారు. మ‌రో మూడు విడ‌తల్లో కూడా మంజూరు చేస్తామ‌ని దీనిలో భాగంగా జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తామ‌న్నారు.

స్ధానిక ఎంపీ ఈట‌ల రాజేందర్‌, ఎమ్మెల్యే గ‌ణేష్‌లు ప్ర‌స్ధావించిన అంశాల‌మేర‌కు వాజ్‌పేయి కాల‌నీలో మొండిగోడ‌ల‌తో ఉండిపోయిన ఇండ్ల‌ను పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు ఇచ్చేలా మంత్రిగారు స‌భాముఖంగా అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు మర‌మ్మ‌తులు చేసి నెల‌రోజుల‌లోగా పేద‌ల‌కు కానుక‌గా అందిస్తామ‌ని వెల్ల‌డించారు. కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పేద‌ల‌కు ఎటువంటి ఇబ్బంది రాకుండా తాత ముత్తాత‌ల నుంచి నివ‌సిస్తున్నవారి భూముల‌ను ఫ్రీహోల్డ్ చేస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున త‌గు సాయాన్ని అందిస్తామ‌ని దీనికోసం ఎంపీ రాజేంద‌ర్ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి త‌గు ఆదేశాలు తేవాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సౌక‌ర్యాల‌తో కూడిన శ్మ‌శాన‌వాటిక‌ను నిర్మిస్తామ‌ని ఈ విష‌యంలో కూడా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తుల సాధించాల‌ని కూడా ఎంపీ ఈట‌ల‌కు సూచించారు. కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి గ‌తంలో ఇచ్చిన హామీల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తామ‌న్నారు. పేద‌ల ఇండ్ల గృహ‌ప్ర‌వేశాల‌లో పాల్గొంటున్నందుకు త‌న జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని మంత్రి పొంగులేటి అన్నారు. అనంతరం పేద‌ల‌కు ఇండ్ల ప‌ట్టాలు పంపిణీ చేశారు.