భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • ప్రపంచానికే తల మాణికం కాబోతోంది
  • ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీ చుట్టే తిరగబోతుందేమో అన్న భావన తనకు కలిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు దేశంలోని ఏ నగరానికి ఈ వ్యవస్థ లేదు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్డు వేయడం, ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి తో మాట్లాడి మంజూరు చేయించుకుని వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే… ఆ పనులకు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు రోడ్డు ఈ పనులన్నీ చూస్తుంటే ఇది ఒక మహా అద్భుతంగా మారే నగరంగా రూపు దిద్దుకోబోతుందని అన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి తెల్లవారుజామునే భవిష్యత్తు నగరానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు.

436 ఏళ్ల కిందట కులీ కుతుబ్ షా ల పాలనా కాలంలో ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాటి రాజ్యం అవసరాలకు దక్షిణ మూసి అనువైన ప్రాంతంగా గుర్తించి 436 సంవత్సరాల క్రితం సుసంపన్నమైన, ప్రపంచ పటంలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుంది అన్నారు. ఈ నగర నిర్మాణ సమయంలో కులీకుతుబ్షా దేవుని ప్రార్థిస్తూ దేవా నదులన్నిటిని చేపలతో నింపినట్టు నా నగరాన్ని జనాభాతో నింపండి అని ప్రార్థించాడు అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కులి కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఎలా నిలబెట్టారో.. ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేస్తూ పిలుపునిచ్చింది అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో కూడిన అనేక కార్యక్రమాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది ఆశీర్వదించమని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానంతో అంతా కదిలి వచ్చాం అన్నారు. వారి ఆహ్వానంతో కులీ కుతుబ్ షా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం కాబోతోంది, ఈ సిటీ ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప వైద్య, విద్యాసంస్థలు రాబోతున్నాయి అన్నారు. పనుల కోసం దేశ, విదేశాల్లో తిరిగి మంచి శాంతి భద్రతలతో స్థిర నివాసం ఎక్కడ అంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉంది అన్నారు. గొప్ప సంకల్ప బలంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యక్రమం త్వరితగతిన పూర్తి కావాలని ఆ దేవుని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సిటీ నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని, చరిత్రలో నిలిచిపోయే నగరం దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం అన్నారు.