మూసీ నది పునరుజ్జీవం కోసం నగరవాసులు సహకరించాలని, మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం కోల్పోతున్న వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఎవరినీ నష్టపోనివ్వం.. కష్టపెట్టం. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. పేదలకు అండగా నిలబడుతుంది’’ అని హామీ ఇచ్చారు. నగరంలోని అంబర్‌పేటలో హైడ్రా పునరుద్ధరించిన ‘బతుకమ్మ కుంట’ను ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మకుంటను ప్రారంభించడంతోపాటు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వామ్యం చేస్తేనే దసరా, బతుకమ్మ పండుగలకు నిండుదనం ఉంటుందని, ఈ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో మహిళలను భాగస్వామ్యం చేయడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. తాము హైడ్రాను ఏర్పాటు చేస్తే కొంత మందికి అర్థం కాలేదని, కొందరికి అర్థమె..ౖ వారి కబ్జాలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కొవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చాయని, గంట, రెండు గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు వాతావరణంలో వచ్చాయని అన్నారు. వాతావరణ కాలుష్యంతో వస్తున్న ఈ మార్పులతో.. ఎక్కడ చూసినా వర్షాలు, ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు నీటి ప్రవాహంతో కళకళలాడుతూ జీవధారగా ఉన్న మూసీనది.. ఇప్పుడు మురికి కూపంగా మారిందన్నారు. అందుకే నగరంలోని చెరువులను విడిపించడం, నాలాలను విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడాన్ని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. భారీ వర్షం కురిస్తే తట్టుకునే స్థితిలో నగరంలో మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. భవిష్యత్తులో తట్టుకునే ఏర్పాట్లు చేసుకోవాలని, లేకపోతే జీవితాంతం సంపాదించుకున్నదంతా రాత్రికి రాత్రే నీళ్లలో మునిగిపోతాయని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి పేదరికాన్ని, పేదలను చూశానన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వారి పట్ల తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని, వారిని ఇబ్బంది పెట్టి చేసేదేముందని అన్నారు. ‘‘మూసీని చుట్ట చుట్టి సూట్‌కేసులో పెట్టుకుంటానా? మా ఇంటికి తీసుకెళ్తానా? విదేశాలకు తీసుకెళ్లి దాచుకుంటానా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది.. అనర్థాలు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు కిలోమీటర్ల మేర మూసీనది పరివాకవాక ప్రాంతం ఉందని, బఫర్‌జోన్‌లో ఇల్లు కట్టుకున్న పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించాలన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాని సీఎం తెలిపారు. వెంటనే సర్వే చేసి అంచనా వేయలని మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు.
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రారంబోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఛే నెంబర్ చౌరస్తా వద్ద వందలాది మంది మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి బతుకమ్మ కుంట వరకు సీఎం కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి 7.30గంటల సమయంలో బతుకమ్మ కుంటను ప్రారంభించారు. బతుకమ్మ కుంటకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేరు పెట్టాలన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచన మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంబర్‌పేటలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా మినీ సెక్రటేరియట్ లాంటి భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాగా, 50 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ.. కబ్జాకు గురైన బతుకుమ్మ కుంటను పునరుద్దరించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు, హైడ్రా కృషితో తన కల సాకారమైందన్నారు. కాగా, హైడ్రా కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన పాటను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
