- కేంద్ర జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీ గిరిరాజ్ సింగ్ కి లేఖ రాసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ః రాష్ట్రంలో CCI , అక్టోబర్ 1 వ తేది నుండి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సీజన్‌లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగయిందని, సుమారు 24.70 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పత్తి సాగు చేసేవారిలో ఎక్కువశాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వీరి జీవనోపాధి MSP కొనుగోళ్లపైనే ఆధారపడి ఉందని వివరించారు. గత వారం CCI ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లు అసోషియేషన్ ప్రతినిధులు, మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, MSP అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్ & ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్, రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చించడం జరిగిందని మంత్రి అన్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో సీసీఐ (Cotton Corporation of India) రెండు సార్లు టెండర్లు పిలిచినా, కొత్త మార్గదర్శకాలలో ఉన్న కొత్త నిబంధనలు కారణంగా జిన్నింగ్ మిల్లర్లు పాల్గొనడం లేదు. దాంతో పత్తి కొనుగోలు నిలిచిపోయి, రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గత సంవత్సరం (2024-25) విజయవంతంగా అమలైన విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోందని, ముఖ్యంగా L1, L2 అలాట్మెంట్లు, లింట్ రికవరీ శాతం, ఫోర్ట్‌నైట్ వారీగా జోన్లవారీ లింట్ శాతం నిర్ణయం, రైతుల స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. అదే విధంగా రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం మరియు జిన్నింగ్ & ప్రాసెసింగ్ మిల్లులలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారి క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. గోదాముల నుండి మిల్లులకు పత్తి రవాణాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులకు MSP హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , పత్తి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా మరియు వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్ విజయవంతమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధర క్వింటాల్‌కు మార్కెట్ లో ₹6,700 మాత్రమే ఉందని, ఇది MSP అయిన ₹8,110 కంటే ₹1,410 తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు డిస్ట్రెస్ సేల్స్‌కి గురయ్యే ప్రమాదం ఉందని మంత్రిగారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.