- డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తాం ..
- కేసీఆర్ ప్రభుత్వం RRR ను పట్టించుకోలేదు
- నేను మంత్రి అయిన తర్వాతనే 90 శాతం పైగా భూసేకరణ చేశాం..అందుకు రైతులను ఒప్పించాం
- 4 లేన్ల RRR ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 6లేన్లుగా మార్చుకున్నాం..కేంద్రం సహకరించాలి
- దక్షిణ భాగం విషయంలో రైతుల అనవసర ఆందోళన చెందొద్దు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నేను రైతులకు అన్యాయం చేసే వాళ్లం కాదు
- రైతుల అంగీకారం తోనే ముందుకు పోతాం
- ముఖ్యమంత్రి తో మాట్లాడి త్వరలో మంత్రుల కమిటీ వేస్తాం
- నేను రైతు బిడ్డను..రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా..!
- లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ముకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం
- చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బిఆర్ఎస్ దే
- రోడ్లు అమ్ముకున్న వాళ్లే..అబద్ధపు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు..
- నల్లగొండ బిడ్డగా..ఈ గడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోను
రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారు. శనివారం నాడు మంత్రి చిట్యాల లో మీడియాతో మాట్లాడారు… 2017- 18 లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు కు అంగీకరిస్తే..బిఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మంత్రి కోమటి రెడ్డి నాటి కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నపుడు రైతులకు అన్యాయం జరగకుండా ధర్నాలో పాల్గొని,ప్రజా ప్రభుత్వం వచ్చి మంత్రి అయిన తర్వాత మార్కెట్ రేట్ ఇప్పించి రైతులను ఒప్పించానని అన్నారు. తాను మంత్రిగా అయిన కొత్తలో 6శాతం భూసేకరణ మాత్రమే అయితే రైతులను ఒప్పించి ఇప్పుడు 98శాతం పైగా పూర్తి చేసామని చెప్పారు.4లేన్ల RRR 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6లేన్లుగా మార్చుకున్నామని తెలిపారు. సంగారెడ్డి నుండి నర్సాపూర్,తూప్రాన్, గజ్వేల్,జగదేవపూర్ వయా భువనగిరి,చౌటుప్పల్ వరకు 161.518కిలో మీటర్ల నార్త్ పార్ట్ ఉండనుందని అన్నారు. భూసేకరణ కోసం 6వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని కేంద్రం,రాష్ట్రం చెరిసగం వాటా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 3వేల కోట్లు హడ్కో రుణం తెచ్చామని అన్నారు. ఇప్పటికే పలు మార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశామని,ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం అయ్యామని పనులు వేగం చేసేలా మాట్లాడామని చెప్పారు. ఉత్తర భాగం అలైన్మెంట్ లో ఎలాంటి మార్పు ఉండదని,జనవరిలో పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఆందోళన వద్దు:
దక్షిణ భాగం విషయంలో రైతుల అనవసర ఆందోళన చెందొద్దని మంత్రి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆర్ అండ్ బి మినిస్టర్ అయిన తాను రైతుల అంగీకారం తోనే ముందుకు పోతామని తేల్చిచెప్పారు. “నేను రైతు బిడ్డను..రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా” అంటూ త్వరలోనే ముఖ్యమంత్రి తో మాట్లాడి మంత్రుల కమిటీ వేస్తామని తనను కలిసిన రైతులకు హామీ ఇచ్చారు. అయితే ఇటీవల పత్రికల్లో,సోషల్ మీడియాలో రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ,నిర్మాణం కోసం 45వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కట్టిన,ఇప్పుడు లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ముకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని,చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బిఆర్ఎస్ ది మాత్రమేనని దుయ్యబట్టారు. రోడ్లు అమ్ముకున్న వాళ్లే..అబద్ధపు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారనీ, వాళ్ల ట్రాప్ లో పడొద్దని రైతులను కోరారు. వాళ్ళు ఒక్క ఇల్లు కట్టలే,రేషన్ కార్డు ఇయ్యలే,సన్న బియ్యం ఇయ్యలే,ఇంటికి ఉచిత కరెంట్ ఇయ్యలే కానీ లక్షల కోట్లు అప్పులు మాత్రం చేసారని ఎద్దేవా చేశారు. నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా తనను ఇష్టపడే వ్యక్తని తన పేరు చెప్పి గౌరెల్లి – భద్రాచలం హైవే,ఎల్బీనగర్ – మల్కాపురం రోడ్డు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ – విజయవాడ హైవే 8లేన్ల నిర్మాణ పనులు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం అవుతాయని మరోమారు స్పష్టం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదనీ,రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అలైన్మెంట్ విషయంలో పెద్ద వాళ్ళకు ఒక న్యాయం,పేద వాళ్లకు ఒక న్యాయం ఉండదని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని తేల్చి చెప్పారు. “నల్లగొండ బిడ్డగా..ఈ గడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోను” అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.