చౌటుప్పల్‌ పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

దసరా పండుగ అయిపోయింది. పల్లెల్లో నుంచి నగర వాసులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవడంతో సొంతూళ్లకు వెళ్లిన వారు నగరానికి చేరుకుంటున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాల రద్దీ పెరిగి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాలా మంది ఆదివారమే పల్లెల్లో నుంచి పట్నానికి బయలు దేరారు. దసరా పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో పలు జిల్లాలకు ప్రజలు బయలు దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరంతా తిరిగి శనివారం నుంచే హైదరాబాద్‌కు రిటర్న్ అయ్యారు. కొంతమంది శనివారం, మరికొందరు ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

అయితే మరికొందరు ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున హైదరాబాద్‌కు పయనమయ్యారు. కానీ వారికి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ముప్పు తిప్పలు పెడుతోంది. టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ 65 వ జాతీయ రహదారిపై దసరా రిటర్న్ జర్నీ రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చౌటుప్పల్ నుండి రెడ్డిబావి వరకు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ట్రాఫిక్ పోలీసులు పత్తా లేకుండా పోవడంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దీంతో హైవేపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.